ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డిజైన్ రెడీ
రూ.15 కోట్లతో 2.30 ఎకరాల్లో నిర్మాణం
పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలం
నివేదిక పంపిన గద్వాల జిల్లా యంత్రాంగం
త్వరలో మంత్రి కేటీఆర్‌తో భూమి పూజ
గద్వాల, ఆగస్టు19: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సిద్దిపేట తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. నాలుగు బ్లాకుల్లో మార్కెట్ నిర్మించడానికి డిజైన్ ఖరారు చేశారు. అధికారులు తయారు చేసిన డిజైన్‌ను మాస్టర్ ప్లాన్‌తో ప్రభుత్వానికి, అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ శాఖకు నివేదిక పంపారు. అక్కడి నుంచి అనుమతి రావడంతో త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భూమి పూజ చేయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాలుగు బ్లాకుల్లో సుమారు 217దుకాణాలు నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.15కోట్లతో నిర్మించనున్నారు. డిజైన్, మాస్టర్ ప్లాన్‌ను బట్టి అధికారులు ఖర్చు అంచనా వేశారు.
జిల్లాలో ఇరిగేషన్ పరంగా నీరు పుష్కలంగా ఉన్న గద్వాల, అలంపూర్ తాలూకాల్లోని రైతులు ఎక్కువశాతం కూరగాయల వైపు మొగ్గుచూపుతున్నారు. కూరగాయలు అమ్ముకోవడానికి సరైన వసతులు లేకపోవడంతో దళారులకు గిట్టుబాటు ధర రాకున్నా విక్రయించే పరిస్థితి నెలకొంది. జిల్లాలో గద్వాల నియోజకవర్గంలో జూరాల, నెట్టెంపాడ్, అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా కాలువకు నీరు పారుతున్నందునా ఇక్కడి ప్రజలు కూరగాయలు పండిస్తున్నారు. వాటిని విక్రయించేందుకు రైతు బజార్లు లేకపోవడంతో కమీషన్ ఏజెంట్లకు తక్కువ ధరకే అమ్ముకునేవారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ మాంసం,చికెన్,చేపలు విక్రయిస్తున్నారు. శుభ్రత పాటించక పోవడంతో కొనుగోలుదారులు రోగాల బారిన పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగితే వీరికి ఇబ్బందులు తప్పనున్నాయి.
నాలుగు బ్లాకుల్లో నిర్మాణం..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నాలుగు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. మొదటి బ్లాక్‌లో హోల్‌సేల్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడే చిన్నారులు ఆడుకోవడానికి పార్కు,జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారులు కూరగాయలు నిల్వ ఉంచుకోవడానికి ఏసీ వసతితో గదులు నిర్మించడానికి ప్రణాళిక తయారు చేశారు. రెండో బ్లాక్‌లో 100దుకాణాలతోపాటు సూపర్‌మార్కెట్, బ్యాంక్, మార్కెట్‌కు వచ్చే వారికోసం ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. పూలు, పండ్లు అమ్ముకునే వారికి 20దుకాణాలు, అక్కడే అధికారి కార్యాలయంతో పాటు ధరల పట్టిక తెలియజేయడానికి ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు విద్యుత్ సరఫరా కోసం రూ.3.50కోట్లతో 250కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ మార్కెట్ పై భాగంలో ఏర్పాటు చేయనున్నారు. మూడో బ్లాక్‌లో మటన్,చికెన్ వ్యాపారుల కోసం 58దుకాణాలు నిర్మించనున్నారు. 4వ బ్లాక్‌లో చేపల మార్కెట్ ఏర్పాటుకు 39దుకాణాలు నిర్మించనున్నారు. అక్కడే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తారు. మార్కెట్లో నుంచి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయడంతో పాటు దాని నుంచి వెలువడే గ్యాస్ ద్వారా విద్యుదుత్పత్తి అయ్యే విధంగా ప్రణాళిక తయారు చేశారు.
పార్కింగ్ కోసం ..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను 2.30 ఎకరాల్లో నిర్మించనున్నారు. పార్కింగ్ కోసం అదనంగా స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకున్నారు. పార్కిం గ్ స్థలంలో ఒకే సారి 60కార్లు, 2వేల బైక్‌లు ఆపే విధంగా స్థలం ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు బ్లాకుల చుట్టూ 24ఫీట్ల రోడ్లు నిర్మించనున్నారు. సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్నది.
అన్ని ఒకే చోట లభ్యమయ్యేలా ..
ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు అన్ని ఒకే చోట లభ్య మయ్యే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.15కోట్లతో నిర్మించడానికి డిజైన్ తయారు చేశాం. అందులో కూరగాయలు, నిత్యావసర సరుకులు,చికెన్, మటన్, చేపలు అన్ని ఒకే చోట వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణం చేపడుతున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి త్వరలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో భూమి పూజ చేయించి సాధ్యమైనంత త్వరలో దానిని అందుబాటులోకి తీసుక వస్తాం.