అయిజ, ఆగస్టు 18 : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయిజ పట్టణంలోని ఒల్లూరుపేట, కోట్ల వీధి, మడ్డిగుంత కాలనీలతోపాటు భూంపురం, మేడికొండ, ఉత్తనూరు, పులికల్, ఉప్పల, బైనపల్లి తదితర గ్రామాల్లోని మసీదులలో పీర్లు కొలువు దీరాయి. ఆయా మసీదుల ఎదుట తవ్విన అలయ్లో అగ్ని గుండం రాజేసి దానిచుట్టూ అలయ్, బలయ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అయిజ పట్టణంలోని ఒల్లూరుపేట మసీదులో అలీ అక్బర్ అలీ, హస్సేన్ హుస్సేన్, గద్వాల హుస్సేన్, దూల్ పీర, చందమామ పీర్లు కొలువుదీరాయి. ఈ నెల 20న శుక్రవారం పీర్లు నిమజ్జానికి తరలిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మల్దకల్ మండలంలో..
మల్దకల్, ఆగస్టు 18 : మండలంలోని మద్దెలబండ, ఎల్కూర్, మల్దకల్, సద్దలోనిపల్లి, పాల్వాయి, విఠలాపురం తదితర గ్రామాల్లో బుధవారం మొహ్రరం వేడుకలు నిర్వహించారు. మల్దకల్లో మంగళవారం రాత్రి గ్రామంలోని మసీదు నుంచి ఇమాం కాశీం సాబ్ పీరును ఊరేగించారు. పీర్ల పండుగ సందర్భంగా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున అలయ్, బలయ్ ఆడారు.
ఘనంగా లాల్సాహెబ్ పీర్ల ఉత్సవాలు
గద్వాల రూరల్, ఆగస్టు 18 : మండలంలోని అనంతపురం గ్రామంలో లాల్సాబ్ సాహెబ్ పీర్ల ఉత్సవాలు తొమ్మిదో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పీర్లను గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఇమాంసాబ్లు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.