గద్వాల, ఆగస్టు15: జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరూ కంకణబద్ధులై పని చేయాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జరిగిన 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ రంజన్ రతన్కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా విప్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రగతి నివేదికను విప్ కూచకుళ్ల చదివి వినిపించారు. కొవిడ్ కష్టకాలంలో విధులు నిర్వర్తించిన వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అధికారులను అభినందించారు. 1,50,719 మంది రైతులకు రూ.222.33 కోట్లు రైతుబంధు ద్వారా సాయం జమైనట్లు చెప్పారు. రైతు బీమా ద్వారా జిల్లాలో 1570 మంది రైతు కుటుంబాలకు రూ.78.50కోట్లు అందజేశామన్నారు. రూ.50 వేలలోపు రుణమాఫీ ద్వారా 13,501 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదన్నారు. వారికి రూ.46.36 కోట్లు మాఫీ అయ్యాయన్నారు. 400 చెరువుల్లో 2.40 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. జూలై నెలకుగానూ 62,360 మందికి వివిధ రకాల పింఛన్ల కింద రూ.14.31 కోట్లు జమచేసినట్లు చెప్పారు. 1,05,595 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశామన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రఘురాంశర్మ, శ్రీహర్ష, ఆర్డీవో రాములు, మున్సిపల్ చైర్మన్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, రైతుబంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, మాజీ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప పాల్గొన్నారు.