అయిజ, ఆగస్టు14: సురవరం ప్రతాపరెడ్డి గొప్ప సాహితీవేత్త అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అయిజ పట్టణంలో గ్రంథాలయం ప్రారంభోత్సవం, కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాహితీవేత్తగా, పత్రిక సంపాదకుడిగా, రాజకీయవేత్తగా పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన మహనీయుడన్నారు. ఆయన జీవితం భావితరాలకు మార్గదర్శకమన్నారు. నడిగడ్డ కవులు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. నడిగడ్డలో జన్మించిన సురవరం ఆయనకున్న ఆస్తిని ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచాడన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి, ప్రముఖ సామాజిక చరిత్రకారుడు సురవరం అని అన్నారు. తెలంగాణలో పుట్టిన ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణను ఎవరైనా కించపరిచినా, చిన్నచూపు చూసినా ఆయన సహించేవారుకాదన్నారు. తెలంగాణలో వందలాది మంది కవులతో పాటు గొప్ప సాహిత్యం, చరిత్ర ఉందంటూ ప్రతాపరెడ్డి ధైర్యంగా పోరాడరని గుర్తుచేశారు. గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ సాహిత్యాన్ని నలుదిశలా చాటిచెప్పారన్నారు. సురవరం జయంతి సందర్భంగా అయిజలో శాఖ గ్రంథాలయాన్ని నూతన భవనంలో ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, ఇన్చార్జి ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త వెంకట్రామయ్యశెట్టి పాల్గొన్నారు.