అయిజ, ఆగస్టు 13 : పెండ్లయిన 69రోజులకే అనుమానం పెనుభూతమై భార్యను భర్త అంతమొందించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. శుక్రవారం ఎస్పీ రంజన్త్రన్‌కుమార్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయిజ మండలం పర్దిపురానికి చెందిన సరోజమ్మ, మద్దిలేటిగౌడ్ కుమార్తె శరణ్య (గీతాంజలి)(19)కు గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన జయరాంగౌడ్తో జూన్ 4న వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి శరణ్య భర్తను దూరం పెట్టడంతో జయరాం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు సర్దిచెప్పారు. అయినా భర్తను ఆమె దూరం పెట్టింది. దీంతో ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఆధార్‌కార్డులో అడ్రస్ మార్చాలని అత్తామామలకు చెప్పి 11న పర్దిపురం నుంచి గట్టుకు శరణ్యను బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ నెట్వర్క్ సమస్య ఉన్నదని, వనపర్తి సమీపంలోని తిరుమలాయగుట్టపై ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకుందామని తీసుకెళ్లాడు. గుట్టపైకి వెళ్లాక సెల్ఫీ దిగుదామని భార్యను లోయలోకి తోసేసాడు. తర్వాత మీ కూతురు కనిపించడం లేదని అత్తామామలకు ఫోన్‌చేసి చెప్పాడు. అనుమానంతో వారు వెంటనే అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎస్పీ రంజన్త్రన్‌కుమార్, డీఎస్పీ యాదగిరి పర్యవేక్షణలో సీఐ, ఎస్సై జగదీశ్వర్ విచారణ చేపట్టారు. జయరాంను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే లోయలోకి తన భార్యను తోసేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. భర్త సమాచారం మేరకు గురువారం తిరుమలాయగుట్ట వద్ద శరణ్య మృతదేహాన్ని గుర్తించి గద్వాల దవాఖానకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ యాదగిరి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్, పోలీసులను ఆయన అభినందించారు.