జడ్చర్లటౌన్, ఆగస్టు 13: ప్రేమ, పెండ్లిపేరుతో మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను నమ్మించి లొంగదీసుకున్న కేసులో నిందితుడితోపాటు అతడికి సహకరించిన గ్రామకార్యదర్శిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. రాజాపూర్‌కు చెందిన దేవరకాడి మహేశ్ అనే యువకుడు జడ్చర్లలోని సరస్వతీనగర్కాలనీలో నివాసముంటున్నాడు. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి మానేశాడు. 10నెలల కిందట ఓ అమ్మాయి ద్వారా జడ్చర్లకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. బాలికతో సెల్ఫోన్లో చాటింగ్ చేస్తూ పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన మిత్రుడైన జడ్చర్ల మండలం పోచమ్మగడ్డతండా గ్రామకార్యదర్శి సంపంగి మహేశ్ అద్దెకుంటున్న ఇంటికి బాలికను పిలిచి కలిసేవాడు. ఈ క్రమంలో బాలికతో దిగిన ఫొటోలు బయటపెడుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఈ నెల 4న బాలికతో పెండ్లి చేసుకుందామని, హైదరాబాద్‌లోని జ్యోతి హాస్టల్ వద్దకు రావాలని ఫోన్ చేయడంతో బాలిక అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మహేశ్‌పై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న నిందితుడు మహేశ్ హైదరాబాద్‌కు వెళ్లకుండా తప్పించుకున్నాడు. ఈ నెల 10న బాలిక జడ్చర్లకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలిపింది. నిందితుల కోసం గాలిస్తుండగా గురువారం జడ్చర్లలోని ఆర్అండ్బీ వద్ద నిందితుడు డీ మహేశ్‌ను, మరో నిందితుడు సంపంగి మహేశ్‌ను మార్కెట్‌యార్డు వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల పల్సర్ వాహనం, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నిందితుడి ఫోన్‌కాల్ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ వీరాస్వామి, ఎస్సై అభిషేక్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.