అలంపూర్, సెప్టెంబర్ 12: పల్లెల్లో అభివృద్ధి పనులు నోచుకోక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇక అనుబంధ గ్రామాల మాట చెప్పనవసరం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక చిన్న గ్రామాలతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్ కొత్తగా గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టారు. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పం చాయతీల అభివృద్ధికి పల్లెప్రగతి పేరిట ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలు మారి పల్లెల్లో పట్టణ హంగులు కనబడుతున్నాయి. మండలంలో కొత్తగా ఏర్పడిన సింగవరం-1 గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. మండలానికి చివరలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తుంగభద్ర నదిఒడ్డున ఉన్నది. 2011ప్రకారం గ్రామంలో మొత్తం 165 కుటుంబాలకు గానూ 505 జనాభా ఉండగా వారిలో 380 ఓటర్లు ఉన్నారు. కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. కొత్తగా సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి రాంప్రసాద్ (ఎంబీఏ) విద్యావంతుడు, యువకుడు, సమాజంపై అవగాహన కలిగిన వ్యక్తి కావడంతో పార్టీలకతీతంగా గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో డ్రైనేజీలు, పారిశుధ్య కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనం, గ్రామ శివారులో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డుల ఏర్పాటు, మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో ప్రతిరోజూ నీటిని అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో 50 విద్యుత్ స్తంభాలకు వీధిదీపాల ఏర్పాటు, మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు.
ప్రగతి పనుల్లో ముందంజ
పల్లెప్రగతిలో భాగంగా గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. కొత్త గ్రామ పంచాయతీ కావడంతో అన్ని వసతులు, సౌకర్యాలు సమకూరాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది. జిల్లా, మండలస్థాయి అధికారుల సలహాలు, సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాం. గ్రామస్తులు, గ్రామపెద్దలు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నారు.
అధికారుల ప్రోత్సాహంతోనే..
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ నిధులతోపాటు స్థానిక అధికారుల ప్రోత్సాహం ఉంది. అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఎంపీడీవో సుగుణకుమార్, వివిధ శాఖల అధికారులు, గ్రామపెద్దల సలహాలు, సూచనల మేరకు పనులు వేగవంతం చేశాం. కొత్త పంచాయతీ అయినప్పటికీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. గ్రామసభలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.