వైభవంగా జములమ్మ కల్యాణం
పట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే బండ్ల దంపతులు
వేలాదిగా తరలొచ్చిన భక్తులు
వేడుకను తిలకించి మురిసిన జనం
గద్వాలటౌన్, ఆగస్టు31: పెళ్లి కూతురై జములమ్మ అమ్మవారు కల్యాణ వేదికపై కొలువుదీరగా.. త్రిశూల రూపంలో జమదగ్ని మహర్షి పెళ్లి కొడుకై కొలువుదీరగా.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించగా..బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 11.45నిముషాలకు అమ్మవారి మెడలో జమదగ్ని మహర్షి మాంగళ్య ధారణ చేశారు. బాజా భజంత్రీలు చప్పుళ్లతో శివసత్తులు భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. తొలిసారి కల్యాణ వేదికపై ఆ జంటను చూసిన భక్తజనం మురిసిపోయింది. యావత్తు నడిగడ్డ పులకించి పోయింది.
నడిగడ్డ ప్రజల ఇలవేల్పుగా జమ్మిచేడులో కొలువు దీరిన జమ్మిచేడు జములమ్మ కల్యాణోత్సవాన్ని పాలకమండలి, అధికారులు నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కల్యాణానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఇక ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి మంగళవారం నిర్వహిస్తామన్నారు. అమ్మవారిని నడిగడ్డ ప్రజలే కాకుండా నాలుగు రాష్ర్టాల ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుస్తారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి ఎప్పటికీ ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సుభాన్, రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.