నిజామాబాద్ లీగల్, జనవరి 22 : సామాజిక స్పృహ, వృత్తి నిబద్ధత ప్రజాహిత ఆలోచనా ధోరణులు సమాజ వికాసానికి ఉపయోగపడుతాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్ మొదటి అంతస్తులో నిర్మించిన పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్‌ను హైకోర్టు నుంచి వర్చువల్ ద్వారా సహచార న్యాయమూర్తి విజయ్‌సేన్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించి మాట్లాడారు. మెమోరియల్ హాల్ నిర్మాణానికి దివంగత గంగారెడ్డి కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక చేయూత చాలా విలువైనదని, మౌలిక వసతుల కల్పన అనేది బాధ్యతాయుతమైన కార్యక్రమమని అన్నారు. నూతనంగా నిర్మించిన పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ జ్యుడీషియరీ సమావేశాలు, సభలు, సెమినార్లకు వేదికగా నిలువబోతున్నదన్నారు. హైకోర్టు జడ్జి, జిల్లా ఫోర్ట్పోలియో జడ్జి బి. విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కనీస వసతులు ఉంటేనే సౌలభ్యంగా ఉంటుందని, రోజువారీ వృత్తి కార్యక్రమాలకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని, హైకోర్టు న్యాయమూర్తి హోదాలో జిల్లా పోర్ట్ పోలియో జడ్జిగా న్యాయస్థానాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. చిరకాల స్వప్నం సాకారమైందని న్యాయవాదులందరి తోడ్పాటుతో మెమోరియల్ హాల్ ప్రారంభించడం సంతోషదాయకమని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ప్రసంగిస్తూ ఒకేరోజు మెమోరియల్ హాల్, ప్రథమ చికిత్స కేంద్రం ప్రారంభించడం శుభసూచకమని, మరిన్ని మంచి కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బంది, కక్షిదారులందరికీ అందుబాటులోకి మౌలిక వసతులు చేకూరడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు మాదస్తు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జిలు విక్రమ్, కిరణ్మహి, అదనపు జిల్లా జడ్జిలు గౌతంప్రసాద్, పంచాక్షరి, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, భవ్య, గిరిజ, అజయ్‌కుమార్ జాదవ్, సీనియర్ న్యాయవాదులు గొర్రెపాటి మాధవరావు, కృష్ణానంద్, జీవీ కృపాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌సుబేదార్, మధుసూదన్‌రావు, శ్రీహరి ఆచార్య, ప్రభుత్వ న్యాయవాది ఈగ గంగారెడ్డి, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ద్యివాంగులకు ఉచితంగా వైద్య పరికరాలు అందజేశారు.