కార్పొరేషన్, మార్చి 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారికి సీఎంసహాయనిధి కింద పెద్దమొత్తంలో ఆర్థిక సాయం అందజేస్తున్నదని చెప్పారు. నియోజకవర్గానికి చెందిన 131 మందికి సీఎం సహాయనిధి కింద రూ. 50. 41లక్షలు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన చెక్కులను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మీ సేవా కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఇందుకు బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్ నాంపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు శ్యామ్‌సుందర్‌రెడ్డి, సుంకిశాల సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.