మన్సూరాబాద్ : పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ఎంఆర్ డీసీ చైర్మన్ , ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్ ప్రెస్ కాలనీలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి 15 నుంచి 18 సంవత్సరాలు కలిగిన పిల్లల వ్యాక్సినేషన్ ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
మొదటి రోజు ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 200 మంది పిల్లలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆన్ లైన్ లో కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోని వారికి సైతం వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని.. ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చి కోవిన్ యాప్ లో తమ పేర్లను నమోదు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు ప్రబలుతుండటం వలన విధిగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న వారితో ఇప్పటి వరకు టీకాలు వేసుకోని పెద్ద వయస్సు వారు టీకాలు వేసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసు కోవడం వలన తమను తాము రక్షించుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసినట్లవుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం టీకా తీసుకుంటున్న పిల్లలకు నాలుగు వారాల అనంతరం రెండో డోస్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రెండు డోసులు టీకా తీసుకున్న పెద్ద వారికి ఈనెల 10 నుంచి బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. టీకా సెంటర్లను సైతం పెంచి వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.