నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 21 : కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా చేపడుతున్న ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో వైద్య సిబ్బంది చేపట్టిన సర్వేను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే ఐసొలేషన్ కిట్‌ను అందజేయాలని సూ చించారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వార్డుల వారీగా సర్వేను ముమ్మరం చేయాలని తెలిపారు. ఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, అభంగపట్నం సర్పంచ్ రమాదేవి, కార్యదర్శి రామాగౌడ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ముమ్మరంగా సర్వే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే ప్రారంభమయ్యింది. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సిబ్బంది సర్వే చేపడుతున్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని భీమ్‌గల్ ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్‌పవార్ ప్రజలకు సూచించారు. బోధన్, ముప్కాల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వేను నిర్వహించారు. ఏడు రోజులకు పైగా జ్వరంతో బాధపడుతున్న వారు ఉంటే వారిని దవాఖానకు తరలిస్తామని సిబ్బంది తెలిపారు. జక్రాన్‌పల్లి మండల ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటి జ్వర నిర్వహించారు. కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి, డీఐఈవో రఘురాజ్ హాజరై పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మణ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. ఇందల్వాయి మండలంలో ఇంటింటి జ్వర సర్వేను నిర్వహించినట్లు డాక్టర్ శంకర్ తెలిపారు. జ్వరం, జలుబు, కీళ్లనొప్పులుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కోటగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు కరోనాపై అవగాహన కల్పించారు. దోమలెడ్గి సర్పంచ్ జయరాణీదిగంబర్, ఎంపీటీసీ విఠల్, కార్యదర్శి నాగార్జున్‌గౌడ్, ఆశ తదితరులు పాల్గొన్నారు. వర్ని మండలంలోని శ్రీనగర్, వకీల్‌ఫారం, సిద్దాపూర్, కోకల్‌దాస్ తండా తదితర గ్రామాల్లో శుక్రవారం సర్వే నిర్వహించారు. రుద్రూర్, మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో చందర్, సర్పంచులు రాజు, కలియాబాయి, భర్త్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండలంలోని పలు గ్రామాల్లో వైద్య బృందం సభ్యులు ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందులను అందజేశారు.