ఖలీల్‌వాడి, జనవరి 12: పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర రైతాంగానికి రూ.50వేల కోట్లు అందజేసిన సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగర పరిధిలోని అర్సపల్లిలో బుధవారం నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలోనూ రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆటకం లేకుండా రైతుబంధు సాయాన్ని అందజేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేసి అన్నదాతకు అండగా నిలుస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..