మణుగూరు రూరల్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, దేశానికి వెన్నుముక అయిన అన్నదాతల నడ్డి విరుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలు పెంచి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా అరాచక నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. అద్భుతమైన పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల మోముల్లో చిరునవ్వులు పూయిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం నల్లచట్టాలను రైతుల నడ్డి విరిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. టూరిస్టుల మాదిరిగా రాష్ర్టానికి వచ్చిపోయే బీజేపీ నేతలు.. ఇంత అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను విమర్శించడం హేయమని అన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామన్నారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు అడపా అప్పారావు, ముత్యంబాబు, వట్టం రాంబాబు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.