యాదగిరిగుట్ట రూరల్, జనవరి 20 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం గుట్ట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్, ఉపాధిహామీ, పల్లెప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని, తడి, పొడిచెత్త సేకరించి ఎరువు తయారు చేయాలని సూచించారు. హరితహారంలో నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు పెంచాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీఓ చంద్రశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు.