ఎదులాపురం, ఏప్రిల్ 5 : మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ , ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి, ఎస్సీ కార్యాలయంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. బాబూ జగ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆదిలాబాద్‌లోని జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో రూ.42లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహానీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బస్తీ, దళితబంధు పథకంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 4320 ఎకరాల భూమిని 1800 పేద కుటుంబాలకు పంపిణీ చేశామని చెప్పారు. తర్వలో మరో వెయ్యి ఎకరాల పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దళితబంధు పథకం మొదటి విడుతలోభాగంగా నియోజక వర్గానికి వందమంది చొప్పున 237 మందికి లబ్ధిదారులకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు వివరించారు. విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలు వంద శాతం అందించడంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. అణగారిన కులాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కొనియాడారు. అనంతరం ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు సంబంధించిన పత్రాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలను కలెక్టర్,ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట ్టప్రహ్లాద్, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతా కుమారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ, ఇతర శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 5 : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రాం అని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా అధికారి రాజేశ్వర్‌గౌడ్, దళిత సంఘాల నాయకులు రాములు, సత్యనారాయణ, బొడ్డు లక్ష్మణ్, ప్రభాకర్, ముడుసు సత్యనారాయణ, అంబకంటి ముత్తన్న పాల్గొన్నారు.