
దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేసి, లక్ష్యానికి అనుగుణంగా యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారానికల్లా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని, మార్చి 5 నాటికి గ్రౌండింగ్ పూర్తిచేయాలని సూచించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్మాణం పూర్తయిన చోట డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి విస్తరణ పనులకు భూ సేకరణ యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, టెండర్ ప్రక్రియకు వెళ్లాలన్నారు.
సిద్దిపేట/మెదక్, జనవరి 27 : దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేసి, లక్ష్యానికి అనుగుణంగా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. దళితబంధు అమలుపై గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారానికల్లా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని, మార్చి 5 నాటికి గ్రౌండింగ్ పూర్తిచేయాలని సూచించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల పేరిట దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవాలని సూచించారు. మార్చి 5లోగా గ్రౌండింగ్ అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రూ.పది లక్షల్లో గరిష్టంగా మూడు యూనిట్లు పెట్టుకొనే అవకాశం ఉందని, ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే యూనిట్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.9.90 లక్షలు వెళతాయని, మరో రూ.పది వేలకు తోడు ప్రభుత్వం మరో పదివేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందన్నారు. లబ్ధిదారులు నష్టపోయిన సందర్భాల్లో కలెక్టర్ల వద్ద ఉండే ఈ నిధి అండగా ఉంటుందన్నారని తెలిపారు.
అర్హులకు ఇండ్లు కేటాయించాలి
అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్లపై ప్రగతిపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం అందుకున్న లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు.
యుద్ధప్రాతిపదికన హైవే నిర్మాణం జరగాలి..
మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి విస్తరణ పనులపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మెదక్-సిద్దిపేట- ఎల్కతుర్తి రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన భూ సేకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, టెండర్ ప్రక్రియకు వెళ్లాలన్నారు. ఈ రహదారి విస్తరణ పూర్తయితే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రవాణా సులభతరం అవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, ఒడితెల సతీశ్‌కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్లు హరీశ్, హన్మంతరావు, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, మెదక్ డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో శ్యాం ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.