గోల్నాక : నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.వివిధ శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ నాణ్యతలో రాజీపడకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకొని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో పాటు అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధిపై ఆయన ఆరా తీశారు. రహదారుల నిర్మాణానికి అనుమతులు లభించిన వెంటనే అంచనా వ్యయాన్ని సిద్ధం చేసి ఆలస్యం చేయకుండా బిల్లులు పంపించి పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అంతే కాకుండా రహదారుల ఏర్పాటులో ప్రజలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల వ్యవస్థను ఆధునీకరించాలన్నారు. ప్రస్తుతం మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సమస్యల పరిష్కారానికి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి సంక్రాంతి పండుగలోగా అవసరమైన అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సంబంధిత మంత్రులను, ఉన్నతాధికారును సంప్రదించి కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన చౌరస్తాలు, పార్కులు, ఆట స్థలాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఎక్కడైనా అనుమతులు లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దిశానిర్ధేశం చేశారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారు శంకర్, ఫరీద్, మనోహర్, జలమండలి అధికారులు సతీష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.