నిర్మల్ చైన్‌గేట్, జనవరి 13: బాలల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నది. బాలల రక్షణకు సత్వరమే సేవలందించేందుకు జిల్లాకొక బాలరక్షణ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఈ వాహనాన్ని ప్రారంభించగా జిల్లా వాసులకు సేవలు మరింత చేరువ కానున్నాయి.
సేవలు ఇవే..
18 ఏండ్ల లోపు బాలలపై లైంగిక వేధింపులకు గురువుతున్న, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బాలలు, అనాథ పిల్లలకు ఈ రక్షక్ వాహనం ద్వారా సహాయం అందుతుంది. ముందుగా వీరి కి సంబంధించిన సమాచారాన్ని 1098 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. చెన్నైలోని కేంద్ర కార్యాలయానికి ఈ కాల్ వెళ్తుంది. అక్కడి నుంచి సంబంధిత జిల్లా శాఖ అధికారులను అప్రమత్తం చేస్తారు. జిల్లా అధికారులు వెంట నే సహాయం కోరిన దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి బాధిత పిల్లలను బాలసదన్కుగాని, అవసరమైతే వైద్య సహా యం కోసం దగ్గరలోని దవాఖానకు తరలిస్తున్నారు.
బాలల కోసం పనిచేసే శాఖలు
జిల్లాలో బాలల కోసం చైల్డ్‌లైన్, బాలల సంక్షేమ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, బాలల న్యాయమండలి పనిచేస్తున్నాయి. ఇవన్నీ జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంటాయి. హెల్ప్‌లైన్‌కు కాల్ రాగానే సంబంధిత శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి సమన్వయంతో పనిచేస్తాయి. బాల నేరస్తులైతే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఎందుకు నేరస్తుడయ్యాడో గల కారణాలపై అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేస్తారు.
అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాలి
నిర్మల్ జిల్లాకు ఈ వాహనం ఏర్పాటు చేయడం సంతోషకరం. అత్యవసర సమయాల్లో బాల రక్షక్ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ఏ ప్రాంతం వారైనా సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు. ఏ ప్రాంతం నుంచి కాల్ చేశారో అక్కడి అధికారులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి వారికి సత్వరంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
-దేవి మురళి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, నిర్మల్
బాలల పరిరక్షణకే..
బాలల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆపదలో ఉన్న పిల్లలు 1098 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తే సత్వరమే వారి దగ్గరికి చేరుకొని సహాయ చర్యలు చేపడుతారు. లైంగిక వేధింపులు, అనాథ పిల్లలు, వేధింపులకు గురయ్యే పిల్లలు, బాల కార్మికులకు సిబ్బంది సేవలందిస్తారు. అవసరమైతే వారికి అత్యవసర వైద్య సహాయం అందిస్తారు. అనాథలైన చిన్నారులను ఆదిలాబాద్‌లోని బాలసదన్‌లో చేర్పిస్తాం. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
-విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్