బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని హైదర్‌బస్తీలో నిర్వహించిన గ్యార్వీ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బస్తీ వాసులను ఉద్దేశించి మాట్లాడారు.
అంతకు ముందు జీరా కాలనీ వాసులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి వారి సమస్యలను వివరించారు. జీరా కాలనీలో 134 గృహాలను రెగ్యులరైజ్ చేయాలని 1994లో జీవో 816కింద ధరఖాస్తు చేసుకున్నప్పటికీ సుప్రీ కోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉండి ధరఖాస్తులు అలాగే ఉండిపోయాయన్నారు.
2002 లో లబ్ధిదారులకు అనుకూలంగ తీర్పు వచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు ఈ సమస్యలకు పరిష్కారం చూపలేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా ఉందని చెప్పారు. దీంతో పాటు ప్రస్తుతం ఉంటున్న జీహెచ్ఎంసీ క్వార్టర్స్ స్థలాలు త్వరలోనే సొంతం కానున్నాయని హైదర్‌బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.
నగరంలోని 9 ప్రాంతాలలో 485 జీహెచ్ఎంసీ క్వార్టర్స్ నిర్మించడం జరిగిందని అందులో హైదర్‌బస్తీ ఒకటని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారని, పేదలు సంతోషంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపారన్నారు. ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ క్వార్టర్స్‌లో ఉంటున్న వారికి జీవో 58 కింద రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిం చిదని చెప్పారు. పేదలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉప్పలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి : తలసాని శ్రీనివాస్ యాదవ్
ఓల్డ్ గ్యాస్మండీలోని ఉప్పలమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. ఆలయంలో ఇటీవల చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆదివారం ఆలయాన్ని సందర్శించారు.
ఈ సంధర్భంగా ఆలయాన్ని విస్తరించాలని స్థానిక మహిళలు మంత్రిని కోరగా భక్తులకు సౌకర్యవంతంగ ఉండే విధంగ త్వరలోనే తన వ్యక్తిగత నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టెందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.