యాసంగిలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తున్నది. ఇప్పటికే మండలాల్లో ఎక్కడికక్కడే రైతులతో కలిసి నిరసన దీక్షలు చేపట్టిన టీఆర్ఎస్ నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నది. రైతులతో నిరసన తెలిపేందుకు చౌటుప్పల్ వద్ద రాస్తారోకో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతుల మనోభావాలు కేంద్రానికి తెలిసేలా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు ప్రయోజనాలే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా..అన్నదాతలతో కేంద్రంలోని బీజేపీ చెలగాటమాడుతోంది. రైతన్నలను బలిపీఠంపైకి ఎక్కించే దిశగా నిర్ణయాలు తీసుకొని ఆ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. ఆదినుంచీ రైతు పక్షపాతిగా ఉంటున్న సీఎం కేసీఆర్.. కేంద్ర విధానాలతో రైతుల జీవితాలు ఆగం కాకుండా ఉండేందుకు వారి పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. దాంతో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రం మెడలు వంచే దిశగా కార్యాచరణ రూపొందించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. కార్యక్రమాల్లో రైతులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేలా నేతలు వారిని చైతన్య పరుస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద బుధవారం నిర్వహించే దిగ్భంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాయి. ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి రైతులు, అన్నివర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. మండల, గ్రామ, మున్సిపల్, పట్టణ స్థాయి కమిటీలతో పాటు రైతుబంధు సమితుల ప్రతినిధులు, రైతులు నిరసనలో భాగస్వాములై కేంద్రంపై నిరసన గళాన్ని వినిపించనున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సైతం పాల్గొని ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టనున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద నిర్వహించే దిగ్బంధనలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పాల్గొననున్నారు.