నల్లగొండ, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా జరగుతున్న అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక మన ప్రభుత్వంపై కక్ష కట్టిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నిరసన దీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకుని పాటుపడుతుంటే తట్టుకోలేక పోతున్నారన్నారు. తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. మండు వేసవిలో సైతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని తెలిపారు. ఒక్కప్పుడు జై జవాన్.. జై కిసాన్ అన్న దేశం నేడు ఎందుకు కిసాన్‌ను విస్మరిస్తుందని ప్రశ్నించారు. పాలకులు మొదటి నుంచి రైతుకు మద్దతు ఇచ్చారని, ఒక్క మోదీ ప్రభుత్వమే రైతులపై కక్ష కట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. నిరసనలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, శాసన మండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, గోట్స్ అండ్ షీప్స్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మదర్ డెయిరీ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మున్సిపల్ చైర్మన్లు మందడి సైదిరెడ్డి, తిరునగర్ భార్గవ్, రాచకొండ శ్రీనివాస్, చకిలం అనీల్‌కుమార్, ఇరిగి పెద్దులు, బొర్ర సుదాకర్, చీర పంకజ్ యాదవ్, జి.వెంకటేశ్వర్లు, పిల్లి రామరాజు యాదవ్, బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం, కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు రెండు నాల్కల ధోరణితో దొంగాట ఆడి నేడు రైతాంగానికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ఆరేండ్లలో కరువును పారదోలి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు మన దగ్గర అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని డిమాండ్లు వస్తుంటే జీర్ణించుకోలేని కేంద్రం తెలంగాణపై కుట్రలు పన్ని ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. వరి సాగు చేసుకోమని, మేమే కొనుగోలు చేస్తామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇవాళ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. నాడు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిన తెలంగాణలో నేడు పంజాబ్‌కు మించిన ఉత్పత్తి వస్తుందన్నారు. గత యాసంగిలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందంటే దానికి కారణం ఇక్కడ మనం సంపాదించుకున్న నీరు, విద్యుత్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ మినహా దేశంలో అన్ని రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ విద్యుత్ కోతలు ఉన్నాయన్నారు. యాసంగి ధాన్యం కొనే వరకు పోరాటం ఆగబోదని, రైతులు ఎవరూ ఇబ్బంది పడవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసినా చేయక పోయినా రైతులు ఆందోళన చెందొద్దని, కేసీఆర్ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరుగదన్నారు.
దేశానికి స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు బా ధ్యత కేంద్రానిదే. అది మరిచి నేడు రా ష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని అనడం సరికాదు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంపై పోరాటం చేయాల్సిందే. నేడు రైతాంగం మొత్తం నల్ల జెండాలను తమ ఇండ్లపై ఎగురవేసి నిరసన తెలపాలి. అలాగే గ్రామ పం చాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ర్యాలీలు చేపట్టి కేంద్రం దిష్టి బొమ్మ లు దహనం చేయాలి. కేంద్రం స్పందించే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాలి.
-రమావత్ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే
యాసంగి ధాన్యం కొనే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో కేంద్రం మెడలు వంచి ఎలా రాష్ర్టాన్ని సాదించామో ఆదే స్థాయిలో ఫలితం వచ్చేదాకా ఉద్యమిద్దాం. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న క్రమంలో మోదీ శనిలా వచ్చి అడ్డుపడుతున్నాడు. మోదీ మెడలు వంచే వరకు రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి మన సొమ్ము మనకు తెలవకుండానే కేంద్రం లాగేస్తుంది.
వడ్ల విషయంలో కేంద్రం రాష్ట్ర బీజేపీ నేతలు తలో మాట మాట్లాడి నేడు రైతులకు అన్యాయం చేసే పరిస్థితి తీసుకువచ్చారు. కిషన్‌రెడ్డి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అబద్దాలు మాట్లాడటం సరికాదు. ఆ రోజు మీరు వరి సాగు చేయమని రైతులకు చెప్పారు. ఇవాళ ఆ ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కూడ మీదే. కేంద్రం మెడలు వంచేందుకు సీఎం కేసీఆర్ దీక్ష చేపడుతున్నందున రైతాంగం పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలి
– బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్, నల్లగొండ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తుండు. ఎండనకా, వాననకా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మస్తు ఇబ్బంది పెడుతుంది. తెలంగాణపై కేంద్రం దోరణి మార్చుకోకుంటే రైతులందరం తగిన బుద్ది చెబుతాం.
– జటంగి సోమయ్య, రైతు, అడవిదేవులపల్లి
రైతులు ఎవరూ బాధపడవద్దు. తొందర పడి ధరకు అమ్మి నష్టపోవద్దు. జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంటున్నది. సన్న ధాన్యం సాగు చేసిన రైతులు మిర్యాలగూడ మిల్లుల్లో అమ్మండి. ఎవరికి కూడా క్వింటాకు రెండు వేలకు తగ్గకుండా ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దొడ్డు ధాన్యం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటది. కాబట్టి రైతులు ఆందోళన చెందొద్దు.
-నలమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్యే మిర్యాలగూడ
యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం దిగొచ్చేదాకా ఉద్యమిస్తాం. దేశంలోని పలు రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో మాత్రం రైతులపై వివక్ష చూపుతున్నది. టీఆర్ఏస్ సర్కార్ పిలుపు మేరకు కేంద్రం వడ్లు కొనేదాకా ఎన్ని ఉద్యమాలు అయిన చేస్తాం.
– చెన్ను అనురాధ, ఎంపీపీ, పెద్దవూర