నిజామాబాద్, జనవరి 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరం, పట్టణ ప్రాంతాలకు దూరంగా విసిరేసినట్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నప్పటికీ విధులు నిర్వర్తించేందుకు ఒకప్పుడు ఉపాధ్యాయులు ముందు కు రాకపోవడంతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు జీవో నంబర్ 317 ఊపిరి పోసింది. పాఠాలు చెప్పేవారు లేక బిక్కముఖం వేసిన విద్యార్థులు చిరునవ్వు చిందిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దేవారు వస్తున్నారని తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. నూత న జోనల్ వ్యవస్థతో స్థానికతకు పెద్ద పీట వేస్తూ చేపట్టిన సర్దుబాటులో భాగంగా కొద్ది మంది జూనియర్ టీచర్లకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మెజార్టీ వర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా అందుబాటులో ఉన్న టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఏర్పడిన ఖాళీలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుండగా, గతంతో పోలిస్తే మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో, గ్రామాల్లో, గిరిజన తండాల్లో చదువులు చెప్పేందుకు టీచర్లు బడిబాట పట్టేందుకు సిద్ధం కావడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారుమూల పల్లెల్లోనూ పరిస్థితులు మారాయి. తండాలు గ్రామపంచాయతీలుగా మారగా, ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. రవాణా సౌకర్యం మెరుగవడంతో రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి.
జీవో 317తో సమన్యాయం..
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన ఉద్యోగుల విభజనలో జిల్లా కేడర్ పోస్టుల సర్దుబాటు విజయవంతంగా పూర్తయ్యిం ది. ఆయా జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వగా, వారంతా విధుల్లో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేడర్ స్ట్రెంథ్ ప్రకారం 13,621 మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు 7941, కామారెడ్డి జిల్లాకు 5680 మందిని కేటాయించారు. కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌కు 634 మంది, నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాకు 1006 మంది వచ్చారు. వీరిలో నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 677 మంది ఉపాధ్యాయులు, కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌కు 380 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది. కేటాయింపు ప్రక్రియకు ముందు ఏర్పడ్డ ఖాళీలతోపాటు తాజా ఉద్యోగుల సర్దుబాటుతో ఏర్పడిన ఖాళీలను బదిలీలు, పోస్టింగ్‌ల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పోస్టింగ్‌లో మారుమూల ప్రాంతాలు, ఆయా శాఖల అవసరాలను బట్టి కనీస సిబ్బంది ఉండేలా చూశారు. సీనియార్టీ, ఉద్యోగులిచ్చిన ఆప్షన్స్ ఆధారంగా జీవో నంబర్.317లో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ ప్రక్రియకు ముందే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించింది. సంఘాల నాయకుల సూచనలు, సలహాల మేర కు 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవోను విడుదల చేసింది.
దేవుళ్లలా కొలుస్తారు
“జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఉపాధ్యాయుడంటే ఇక్కడి ప్రజలు దేవుడిలా కొలుస్తారు. విద్యార్థులతోపాటు ఆ ప్రాంతాల ప్రజల నుంచి నేను పొందిన ప్రేమ వెలకట్టలేనిది. ఇలాంటి వాతావరణంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామాలను కార్పొరేట్ విద్య కమ్మేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సర్కారు బడులంటే దేవాలయంగా కొలిచే వారున్నారు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించి నాణ్యమైన విద్యను పొందాలనుకునే వారు అనేక మంది ఉన్నారు. నూతన జోనల్ వ్యవస్థ మార్పులు, చేర్పులతో తిరిగి సొంత జిల్లా నిజామాబాద్‌లో పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను.”
ఇంతవరకు ఒక్కరే..ఇప్పుడు ఆరుగురు!
ఇది నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మొత్తం 125 మంది విదార్థులు ఉండగా.. ఇంతకాలం ఒక్కరే టీచర్ విధులు నిర్వర్తించారు. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నూతన జోనల్ విధానం ఈ పాఠశాల స్థితిని మార్చింది. బదిలీల్లో భాగంగా కొత్తగా ఐదుగురు ఉపాధ్యాయులు రానుండగా, స్కూల్లో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య ఆరుకు చేరనుంది. టీచర్ల కోసం గత నెలలో తాము ధర్నాలు కూడా చేశామని, కొత్తగా ఉపాధ్యాయులను కేటాయించడం సంతోషంగా ఉందని శేఖర్ అనే గ్రామస్తుడు తెలిపారు.
ఎన్ని తరగతులున్నా.. ఎందరు విద్యార్థులున్నా.. ఒక్కడే టీచర్. ఆయనొచ్చిన రోజు బడి.. రానిరోజు లేనట్టే. కొన్నిచోట్ల విద్యావలంటీరే బడిని నడిపిస్తున్న పరిస్థితి. పాఠశాల ఉన్నా.. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఆందోళనకు దిగిన రోజులెన్నో. పట్టణ ప్రాంతాలకు దూరంగా విసిరేసినట్లున్న అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. నూతన జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-317తో ఆ పాఠశాలల దశ మారనున్నది. టీచర్ల కేటాయింపులో సమతుల్యతపై గ్రామీణప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వీరి బాధను తీర్చే బాధ్యత మనది కాదా?
రోడ్డెక్కి ధర్నా చేస్తున్న వీరంతా జుక్కల్ మండలం పెద్దఏడ్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. మధ్యాహ్న భోజనం కోసమో.. స్కూల్లో వసతుల కోసమో వీరు రోడ్డెక్కలేదు. తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులను పంపించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ధర్నా చేశారు. వందలాదిమంది విద్యార్థులు ఉన్న తమ పాఠశాలకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడని, తమ పాఠశాలకు రావాలంటే టీచర్లు ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. జీవో-317 పుణ్యమా అని నూతన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం పెద్దఏడ్గి పాఠశాలకు తాజాగా ముగ్గురు ఎస్జీటీలను అదనంగా నియమించింది.