
జిల్లావ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. పంట పెట్టుబడి సాయం అందుకున్న రైతులు ఉత్సాహంగా వారోత్సవాల్లో పాల్గొంటున్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా వేడుక చేసి అభిమానం చాటుకుంటున్నారు. మిర్యాలగూడలో బుధవారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ స్వరాష్ట్రంలో రైతన్న సంతోషాన్ని కండ్లకు కట్టింది. టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొని ఉత్సాహం నింపారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఎండ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు.
దేవరకొండ, జనవరి 12 : రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని రైతులతో కలిసి దేవరకొండ పట్టణంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు రూ.50వేల కోట్లు పెట్టుబడి సాయంగా అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుబంధుతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఏడేండ్ల క్రితం రైతులకు కనీసం 7 గంటల విద్యుత్ అందించిన దాఖలాలు లేవని, తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రైతులకు అనకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందిస్తున్నది దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనని గుర్తు చేశారు. డిండి లిఫ్ట్ పథకం ద్వారా నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 400 ట్రాక్టర్లు, 100 ఎండ్లబండ్లతో బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నేనావత్ పాండునాయక్ ప్రతేక్య అలంకరణతో ఆకట్టుకున్నాడు. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతపల్లి సుభాశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వ్యడ్త దేవేందర్‌నాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనునాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.