గుండాల, ఏప్రిల్ 30 : జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుండాల మండలాన్ని యాదాద్రిభువనగిరి జిల్లాలో కొనసాగిస్తున్నట్లు 2018 డిసెంబర్లో ప్రకటించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. తదనంతరం మండలానికి సంబంధించిన ఒక్కొక్క శాఖను జనగామ జిల్లా నుంచి యాదాద్రిభువనగిరి జిల్లాలోకి మార్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీగా నియామకాలు చేపట్టాలని తాజాగా నోటిఫికేషన్ జారీ చేయగా గుండాల మండలానికి చెందిన నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు టెక్నికల్‌గా ఇబ్బందులు తలెత్తున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పోలీస్ శాఖను సైతం వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి రాచకొండ పరిధిలోకి మార్చుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ శాఖను రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చుకోవడం హర్షణీయం. టెక్నికల్‌గా ఉన్న సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు పోలీస్ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు తొలగిపోయాయి. అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి. ఆలేరు నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలే నా లక్ష్యం.
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే