నిర్మల్,ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలైంది. ముందుగా లోకేశ్వరం మండలంలోని నగర్, అబ్దుల్లాపూర్, లక్ష్మణచాంద మండలంలోని చామన్‌పెల్లి, రాచాపూర్ గ్రామాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమవగా, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆయా సెంటర్లకు తీసుకొస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1960, బీ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1940 మద్దతు ధరతో ఈ కొనుగోళ్లను చేపడుతున్నారు. దీంతో ధాన్యం రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. కాగా మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కల్లాలకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ధాన్యం సేకరణ కోసం గన్నీ బ్యాగుల కొరత రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 13 లక్షల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు చేరవేసేందుకు అవసరమైన రవాణా మొదలగు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 రైస్ మిల్లులు ఉండగా వీటిలో 10 పారా బాయిల్డ్, 31 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా మిల్లుల యజమానులతో పాటు ప్రొక్యూరింగ్ ఏజెన్సీలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించి ధాన్యం సేకరణలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా మిల్లర్లు… ధాన్యం లోడుతో వచ్చే వాహనాలను వెంటనే అన్లోడ్ చేసుకునేలా అవసరమైన మేరకు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. అలాగే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా వెంట వెంటనే మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 185 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 32, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 82, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో 66, జీసీసీ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా మార్కెటింగ్ శాఖ వద్ద 198 ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండగా మరో 58 ప్యాడీ క్లీనర్లను అదనంగా తెప్పిస్తున్నారు. అలాగే అకాల వర్షాల నుంచి అన్నదాతను కాపాడేందుకు 2,300 టార్పాలిన్లను ఇప్పటికే రైతులకు పంపిణీ చేశారు. మరో వెయ్యి టార్పాలిన్లను అదనంగా అందుబాటులో ఉంచనున్నారు.
మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమంగా ఇక్కడి కొనుగోలు కేంద్రాలకు తరలి వచ్చే అవకాశముందని భావించిన అధికారులు దీనిని కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దులోని ప్రధాన మార్గాలైన మూడు చోట్ల బిద్రెల్లి, స్వర్ణ, బెల్‌తరోడా గ్రామాల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన సిబ్బంది సంయుక్తంగా విధులు నిర్వర్తిస్తారు.