నాణ్యమైన పత్తి సాగుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరాఫ్‌గా నిలుస్తున్నది. అంతర్జాతీయంగా ఇక్కడి తెల్ల బంగారానికి డిమాండ్ ఉండడంతో, ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఇక్కడి నేల స్వభావంతో పాటు సాగుకు అనుకూల వాతావరణం ఉండడం కూడా సాగు పెరుగుదలకు కలిసి వస్తున్నది. గత వానకాలం సీజన్లో 10.02 లక్షల ఎకరాల్లో పంట వేయగా, మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయి ధర పలికింది. ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేయగా, ఆయా జిన్నింగ్ మిల్లులకు పత్తి పోటెత్తింది. సీసీఐ నిర్ణయించిన మద్దతు ధరను దాటి, క్వింటాలుకు ఏకంగా రూ. 12 వేలు రావడంతో రైతాంగం మురిసిపోయింది.
ఆదిలాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నాయి. నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ పంటను ఎక్కవ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ భూములు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. పత్తి వేర్లు లోతుకుపోవడం వల్ల నల్లరేగడి నేలల్లో ఉన్న నీటి నిల్వలు పంట ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా వానకాలంలో 1200 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదవుతుంది.
నల్లరేగడి భూముల్లో నీటిని నిల్వ చేసుకునే గుణం ఉండడంతో 20 రోజుల వరకు వానలు పడకపోయినా, పంటకు ఎలాంటి నష్టం ఉండదు. క్రమంగా వానలు పడితే చెల్క భూముల్లో సైతం పంట ఏపుగా పెరుగుతుంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10.02 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాల్లో 3.85 లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 1.61 లక్షల ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2.95 లక్షల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు.
ప్రభుత్వం సీజన్‌కు ముందుగానే రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. చేతిలో డబ్బులు ఉండడంతో వారు మేలు రకమైన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలు తయారు చేసే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో కొత్త వంగడాలు వస్తున్నాయి. రైతులు విత్తనం కొనాలనే విషయంలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారు.
కాయబరువు ఎక్కువ ఉన్నవి, గత పంటసాగు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు ఎంపిక చేస్తారు. ఎక్కువ దిగుబడి సాధించడానికి మొక్కల సాం ద్రతను పెంచుకునే రకాలను వినియోగిస్తున్నా రు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనా లు వేస్తారు. గతంలో నాన్‌బీటీ విత్తనాలను 4X4 ఫీట్ల దూరంలో వేసేవారు. ప్రస్తుతం బీటీ విత్తనాలను 3X3 ఫీట్ల దూరంలో విత్తుతున్నారు.
వరితో పోల్చితే పత్తికి ఎక్కువ లాభాలు ఉంటాయి. సాగు కూడా సులభదాయకం. వరికి ఎప్పుడూ నీటి సౌకర్యం ఉండాలి. పత్తికి 20 రోజుల వరకు వర్షం పడకపోయినా ఇబ్బందులు ఉండవు. పత్తిని సాగు చేసే రైతులకు బాంకుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎకరాకు రూ.36 వేల వరకు రుణం లభిస్తుంది.
పత్తిలో అంతర పంటను సాగు చేస్తే, మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుం చి రక్షణ కలుగుతుంది. ఈ సారి పత్తికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధర లభించింది. ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేశారు. ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు కు రూ.6025 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.12 వేల వరకు చెల్లించి పంటను కొనుగోలు చేశారు.
జిల్లాలోని నేల స్వభావం, పంటకు అనుకూలమైన వాతావరణం, అధిక వర్షపాతం లాంటి కారణంలో జిల్లాలో రైతులు పండించే పత్తి ఆసియా లో నాణ్యమైనదిగా పేరొందింది. దీంతో జిల్లా పత్తి కి జాతీయంగా, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. పింజ పొడవు ఎక్కువగా ఉండడంతో పాటు దారం పొడవు కూడా ఎక్కువగా వచ్చి నాణ్యతగా ఉంటుంది. దారం గట్టిగా వ స్తుంది. దూది సైతం తెల్లగా ఆకట్టుకునేలా ఉం టుంది. వ్యాపారులు ఆదిలాబాద్‌లో సాగు చేసే పత్తిని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని సీసీఐతో పాటు ప్రైవేటు వ్యాపారులు బేళ్లు (గటాన్)గా తయారు చేస్తారు. ప్రైవేటు వ్యాపారులు తమ సొంత జిన్నింగ్లతో పాటు, సీసీఐ అధికారులు లీజుకు తీసుకున్న జిన్నింగ్‌లో పత్తిని నుంచి బేళ్లుగా మారుస్తారు. ఐదు క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ చేస్తే ఒక బేలు తయారవుతుంది. 165 కిలోలు ఉండే బేల్ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 70 వేల వరకు ధర పలుకుతుంది. జిల్లాలోని నాణ్యమైన పత్తి బేళ్లను వ్యాపారులు, సీసీఐ బేళ్లను చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
క్వింటాలు పత్తిలో 33 శాతం దూది. 64 శా తం గింజ, 2 శాతం వేస్టేజ్ కింద పోతుంది. గింజలతో నూనె, పశువుల దాణాను తయారు చేస్తారు. క్వింటాలుకు 8 కిలోల వరకు నూనె వస్తుంది. డబుల్ రిఫైండ్ నూనెను వాడుతారు. ప్రస్తుతం గింజల ధర క్వింటాలుకు రూ.3500 ఉంది. జిల్లాలో జిన్నింగ్లకు ఆయిల్ పరిశ్రమలో కాటన్ నూనెను తయారు చేస్తారు. సీడ్ కంపెనీల యజమానులు పత్తి గింజలను కొనుగోలు చేసి రసాయనాలు కలిపి తిరిగి విత్తనాలుగా తయారు చేస్తారు.