కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/జైనూర్, ఏప్రిల్ 28 : పల్లెల అభివృద్ధి, స్వచ్ఛత, సంక్షేమం అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో మన గిరిజన పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నది. ఇటీవల జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామం సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనకు ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వి షయం తెలిసిందే.
తాజాగా మరో గిరిజన గ్రామం ఆ జాబితాలో చేరింది. సిర్పూర్(యూ) మండలంలోని మహాగాం సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై)కు ఎంపికై జాతీయ స్థాయి లో 17వ ర్యాంకు పొందింది. ఆదివాసులు నివసించే మహాగాం గ్రామం స్వచ్ఛత, అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నది. దీనికితోడు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్న గ్రామంగా గుర్తింపు పొందింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మహాగాం గిరిజనం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఈ గిరిజన గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచింది. గ్రామంలోకి వెళ్లేందుకు సీసీ రోడ్డు వేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు గ్రామస్తులు, ఇతరులకు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలోని ప్రతి వీధిలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వంద శాతం కనిపిస్తున్నది. రోడ్లపై మురుగు నీరు కనిపించదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన భగీరథనీరు చేరుతున్నది.
గ్రామంలో ఏ వీధి చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో దర్శనమిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను మహాగాం వంద శాతం సద్వినియోగం చేసుకుంటున్నది. పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డు, శ్మశాన వాటిక పనులు పూర్తయ్యాయి. ప్రతి వీధిలో మురుగు కాలువలున్నాయి. పంచాయతీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
మహాగాం గ్రామం దశాబ్దాలుగా స్వచ్ఛంద మద్యపాన నిషేధా న్ని అమలు చేస్తున్నది. ఈ గ్రామస్తులు మద్యం, మాంసానికి దూ రంగా ఉంటారు. గ్రామంలో ఏ సమ స్య వచ్చినా ఐకమత్యంగా పరిష్కరించుకుంటారు. దశాబ్దాల క్రితం మహారాష్ట్రకు చెందిన సూరోజీ బాబా ఈ గ్రామానికి వచ్చి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఈ గ్రామంలో ఆలయాన్ని సై తం నిర్మించారు. ఆ మహారాజ్ బోధనలకు ఆకర్షితులైన గిరిజనులు క్రమక్రమంగా మద్యం, మాంసానికి దూరం గా ఉంటూ వచ్చారు. ఇప్పటికీ గ్రామం లో నీసు, కౌసు ముట్టరు. గ్రామంలో తగువులంటే తెలియవు. ఒకవేళ అనుకో ని గొడవలు జరిగితే గ్రా మంలోని ఆలయంలోనే గ్రామస్తులు సమావేశమై అక్కడికక్కడే పరిష్కరించుకుంటారు.
గ్రామస్తుల ఆధ్యాత్మిక చింతనకు తోడు ప్రతి అభివృద్ధి పనిలో భాగస్వాములవుతారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దానిని విజయవంతం చేస్తారు. సుమారు 120 కుటుంబాలుంటున్న ఈ గ్రామం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
దీంతో ఈ గ్రామం జాతీయ స్థాయిలో ‘సంసద్’ యోజనకు ఎంపికైంది. అభివృద్ధి పనులకు తోడు సామాజిక అంశాలు (సోషల్సెక్టార్), ఆర్థికాభివృద్ధి (ఎకనామికల్), మానవ వనరుల అభివృద్ధి (హ్యుమన్ రిసోర్స్), పరిసరాల అభివృద్ధి (ఎన్విరాన్మెంట్), బేసిక్ ఎనిమిటీస్, పర్సనల్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో 44 అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సిర్పూర్(యూ) మండలంలోని మహాగాం ని ఎంపిక చేసింది.
సిర్పూర్(యూ) మండలంలోని చిన్న గిరిజన గ్రామమైన మహాగాంకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాం. సుమారు 120 కుటుంబాలున్న ఈ గ్రామం.. ఆధ్యాత్మికతతో ముడిపడి ఉండడంతో అభివృద్ధి వేగంగా సాగుతున్నది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి. రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని మరితం అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలి.
– ఆత్రం పద్మాబాయి, మహాగాం సర్పంచ్