అతడిది ఆంధ్రా.. బతుకుదెరువు కోసం తెలంగాణ వచ్చాడు. నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నా అతనికి తృప్తినివ్వలేదు. చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తనకున్న అనుభవంతో సాగు వైపు మళ్లాడు. మంచిర్యాల పట్టణ పరిధిలో పదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వినూత్నంగా ఆలోచించాడు. వరి, పత్తికి బదులుగా పండ్లు, కూరగాయలు పండిస్తూ పది మందికి ఉపాధి చూపుతున్నాడు. మల్టీ క్రాప్స్ సాగుచేస్తూ లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంటువంటి లక్ష్మీ ప్రసాద్‌పై కథనం..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో గల పదెకరాల చేనులో వివిధ రకాల పండ్లు, పూలతోపాటు కూరగాయలు సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు లక్ష్మీప్రసాద్. బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఆయన మొదట కన్స్ట్రక్షన్ పనులకు వెళ్లి జీవనోపాధి సాగించాడు. చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. తిరిగి సాగుపై దృష్టి పెట్టి పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. సీజనల్ పంటలు వేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రెండెకరాలతోపాటు పండ్ల తోటల మధ్య అంతర పంటగా వివిధ రకాల పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. బంతి, చామంతి, గులాబీ, మల్లె తదితర పూలతోపాటు వంకాయ, అల్చంత, దోస(కూర దోస, కీర దోస), గోరు చిక్కుడు, చిక్కుడు, టమాట, సోర, బీర, పసుపుతోపాటు సీజనల్ కూరగాయలు సాగు చేస్తున్నాడు. అదనంగా కొబ్బరి మొక్కలతోపాటు ఔషధ మొక్కలైన కిడ్నీ స్టోన్స్ కోసం రణపాల, కొండ పెండాకు, షుగర్‌ను అదుపులో ఉంచే ఇన్సూలిన్ మొక్క, పాములు రాకుండా నల్ల ఈశ్వరీ, తులసి(లక్ష్మీ, కృష్ణ, లవంగ, మింటు, కాశీ) మొక్కలతోపాటు నీడన పెరిగే యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు సాగు చేస్తున్నాడు.
లక్ష్మీ ప్రసాద్ అగ్రికల్చర్ డిప్లొమా, ఇతర ఏదైనా వ్యవసాయ అనుబంధ కోర్సు చదువుకోలేదు. తల్లిదండ్రులు చైతన్య ప్రభు, నర్సింహం వ్యవసాయ పనులు చేసే వారు. వారితో పొలాలకు వెళ్లి నేర్చుకొన్న అనుభవంతోనే పదెకరాల్లో మల్టీక్రాపింగ్ చేస్తూ లబ్ధిపొందుతున్నాడు. ఈ వ్యవసాయ క్షేత్రంలో నీటి కోసం రెండు బోర్లు వేయించి, పశువుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేయించాడు. మొక్కలకు నీరు, ఇతర మందులు నేరుగా డ్రిప్ సిస్టం ద్వారా అందిస్తున్నాడు.
వంద శాతం ఆర్గానిక్ పద్ధతిలో నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఈ ఫాంలో పురుగులు, తెగుళ్ల నియంత్రణకు ఆర్గానిక్ పద్ధతులు పాటిస్తున్నాడు. ఎలాంటి మార్కెటింగ్ చేయకున్నా ప్రజలు, హోల్‌సెల్, రిటైల్ డీలర్లు పెద్ద మొత్తంలో ఫాం వద్దకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మంచిర్యాల, సమీప లక్షెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్ మార్కెట్లతోపాటు గోదావరిఖని నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందుతున్నాడు.
పదెకరాల్లో మల్టీ క్రాపింగ్ చేస్తుండడంతో రోజూ పది నుంచి పదిహేను మందికి కూలీ రూపంలో ఉపాధి దొరుకుతున్నది. తైవాన్ జామ తొమ్మిది నెలల్లోనే పంటకు రావడంతో వాటిని సేకరించేందుకు, గడ్డి తీయడానికి, బొప్పాయి, కూరగాయలు, ఇతర పంటలు కోయడానికి రోజూ సమీప రాజీవ్‌నగర్, దొరగారిపల్లె గ్రామాలకు చెందిన వారు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరితోపాటే ఈ క్షేత్రంలోనే ఇల్లు నిర్మించుకొని లక్ష్మీప్రసాద్ దంపతులు ఉంటూ దగ్గరుండి పనులు చేయిస్తుంటారు.
ఒకే పంటను సాగు చేయడం మాని సీఎం కేసీఆర్ చెప్పినట్లు క్రాప్ డైవర్షన్ చేస్తే ఆర్థికంగా మేలు కలుగుతుంది. రైతులు అధికంగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. అలాకాకుండా మల్టీ క్రాపింగ్ వేయాలనుకునే ఆసక్తి గల రైతులకు నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా. మొక్కలు, గింజలు ఇవ్వడంతోపాటు దగ్గరుండి ఫార్మింగ్ చేయిం చేందుకు, పంట వచ్చేంత వరకు అవసరమైన సలహాలు ఇస్తాను. మల్టీక్రాపింగ్తో రైతుకు లాభంతోపాటు పలువురికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది. సలహాలు, సూచనల కోసం నేరుగా లేదా 9441101104 నంబర్లో సంప్రదించవచ్చు.
– లక్ష్మీప్రసాద్, యువరైతు, మంచిర్యాల
కౌలుకు పదెకరాలు తీసుకోగా.. ఎనిమిది ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. అధిక మొత్తంలో తైవాన్ జామ సాగు చేస్తుండగా.. బొప్పాయి, లోకల్ జామ (తెలుపు, ఎరుపు గింజ), మామిడి (దసలి, బంగిన్‌పల్లి, ఆల్ఫోన్సా, తోతాపురి, చెరుకు రసం, చిన్న రసం, మల్లిక, కేసరి, పండూరి, పొనాస, తైవాన్ రకం, పందిరి మామిడి) పంటలతోపాటు అధిక డిమాండ్ ఉన్న రామాఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, హనుమాన్ ఫలం, వాటర్ ఆపిల్, స్టార్ ప్రూట్, ఉసిరి(రాస, బెలంబి, పచ్చడి), పనాస (యెల్లో పనాస, తైవాన్ గమ్లెస్, తైవాన్ రెడ్), దానిమ్మ, స్వీట్ ఆరెంజ్, మోసంబి, మల్బరి, నేరేడు(బ్రహుడోలి, అల్ల నేరేడు, వైట్ నేరేడి), సపోట(పాల సపోట, కాలాపతి, ఆస్ట్రేలియన్ సపోట), అంజీరా, ఫల్సా, మారేడు(ఏకబిల్వ, మారేడు దళాలు), నిమ్మ తదితర పండ్ల పంటలు సాగు చేస్తున్నాడు. ఇక్కడి వాతావరణానికి తట్టుకునే యాపిల్(మలయాళం, ఆర్మన్ 99, గోల్డెన్) పండ్లు సాగు చేస్తున్నాడు.