పల్లె పల్లెనా గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచుకొని, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలు హోరెత్తించారు. పలువురు వక్తలు .. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్తానాన్ని వివరిం చారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథాకాలపై వివరించారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రం దేశానికే మోడల్‌గా నిలుస్తున్నదని కొనియాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) 21వ ఆవిర్భావ వేడుకలు బుధవారం వైభవంగా కొనసాగాయి. గ్రామాలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి, జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చారు.
జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.