ఆదిలాబాద్ టౌన్ ఏప్రిల్ 27 : గ్రామాల్లో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎర్రటి ఎండలో కాలినడకన పర్యటించారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ధరి, ఖానాపూర్, అల్లికోరి గ్రామాలలో ఆయన పర్యటించారు. అల్లికోరి గ్రామం నుంచి ఎండలో అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి నర్సరీని పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు ఎదుగుదల లేకపోవడం, నీడ కల్పించకపోవడంపై పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల బరువు, ఎత్తులను పరిశీలించారు. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో శివలాల్, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.