రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడేలా.. వర్షాలు వాపస్ వచ్చేలా.. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఏడు విడుతలుగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడ, పండ్లు, పూలను ఇస్తున్నాయి. ఈసారి నిర్వహించే ఎనిమిదో విడుత కార్యక్రమంతో నిర్మల్ జిల్లాలోని అష్టదిక్కుల్లో పచ్చదనం వెల్లివిరిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాకు 44.21 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ నిర్ణయించగా.. ఆయా శాఖలకు లక్ష్యం నిర్దేశించారు. జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ఈసారి అనుకున్న లక్ష్యం మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 27 : రాష్ర్టాన్ని పచ్చగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఇప్పటి వరకు ఏడు విడుతల్లో దిగ్విజయంగా పూర్తయ్యింది. వచ్చే జూన్లో 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను హరితహారానికి నర్సరీల్లో మొక్కలను సైతం అధికారులు సిద్ధం చేశారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఏటా కోట్లాది మొక్కలను నాయకులు, అధికారుల సమన్వయంతో నాటించారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
నాడు నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి నలుగురికి నీడనిస్తున్నాయి. గతంలో కాలుష్య పూరిత వాతావరణంలో ఉన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు కాలు ష్య రహితంగా మారుతున్నాయి. ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. అటవీ ప్రాంతా ల్లో సైతం జంతువులకు ఆహారంగా పండ్ల మొక్కలను నాటించడంతో అవి చెట్లుగా మారి వాటికి జీవనాధారమవుతున్నాయి. అదే స్ఫూర్తితో అటవీ శాఖ మంత్రి నేతృత్వంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అధికారులు, నాయకులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాకు ఈ ఏడాది 44.21 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్ణయించుకోగా అంతకంటే ఎక్కువ మొక్కలు అందుబాటులో తెచ్చారు. లక్ష్యానికి మించి నాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఎనిమిదో విడుత హరితహారానికి ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 396 పంచాయతీలు ఉండగా, అన్ని పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు.ఒక్కో నర్సరీలో దాదాపు 13 వేల చొప్పున పెంచుతుండగా మొత్తం 51.48 లక్షలు అధికారులు అందుబాటులో ఉంచారు. నాటిన మొక్కలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను అధికారులు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా టేకు, ఔషధ, పండ్లు, వేప, చింత, ఈత, ఇప్ప, వెదురు, మోదుగతో పాటు పూల మొక్కలను సైతం అధికారులు పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో, శ్మశాన వాటికలు, పాఠశాలల్లో అనువుగా ఉండేలా పూలు, పండ్ల మొక్కలను అందుబాటులో ఉంచారు.
జిల్లాలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా నిరంతరం నీటి సదుపాయం, టెంట్లను ఏర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఎప్పటి కప్పుడు పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిత్యం నర్సరీలను పర్యవేక్షిస్తూ హరితహారానికి మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని 19 మండలాలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు శాఖల వారీగా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారరు. డీఆర్డీవో పరిధిలోని డ్వామా,ఐకేపీకి 10 లక్షల చొప్పున, వ్యవసాయ శాఖ 3 లక్షలు నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ పరిధిలో 5 లక్షలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో లక్ష, నిర్మల్ 4 లక్షలు, ఖానాపూర్ 2 లక్షలు, భైంసా 4 లక్షలు, నీటి పారుదల శాఖ 50 వేలు, పోలీసు శాఖ 1.50 లక్షలు, ఇలా ఒక్కో శాఖకు కనిష్టంగా రెండు వేల నుంచి గరిష్టంగా 5 లక్షల మొక్కల వరకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఎనిమిదో విడుత హరితహారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. లక్ష్యానికి మించి మొక్క లు సిద్ధం చేశాం. సొంత అంగన్వాడీ భవనా లు ఉన్న వాటిలో కరివే పాకు, మునగ మొక్క లు నాటించేందుకు చర్యలు చేపట్టాం. శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించాం వేసవిలో మొక్క లు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎండిపోయిన మొక్కల స్థానంలో తిరిగి పెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలి.
డీఆర్డీవో విజయలక్ష్మి, నిర్మల్