ఎదులాపురం, ఏప్రిల్ 27: పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు , డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లతో కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మే 23 నుంచి 28 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైందన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించలేదన్నారు.
విద్యార్థులు పరీక్షల భయం వీడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేయనున్నట్లు అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ తెలిపారు. వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందన్నారు.
అంతకుముందు స్కూల్ అసిస్టెంట్ సుకుమార్ పరీక్షల నిర్వహణ సమయం, విద్యార్థుల హాజరు, స్టోరేజ్ పాయింట్లు, ప్రశ్నపత్రాల పంపిణీ, జవాబు పత్రాలను తిరిగి పంపించడం, ఇన్విజిలేటర్లు విధులు, తదితర అంశాలపై వివరించారు. సమావేశంలో డీఈవో ప్రణీత, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.