నార్నూర్, ఏప్రిల్ 24 : ఉపాధి హామీ పథకం కింద నీటికుంట(పాంపాండ్స్)లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తమ పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటి కుంటలు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి కుంటలు తవ్వుకునేలా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. కొందరు రైతులు అవగాహన లేక భూమి పోతుందని ముందుకు రావడం లేదు.
వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా పంట పొలాల వద్ద నిర్మించుకున్న చిన్న కుంటలను (పాంపాండ్స్) అంటారు. రైతులు బోరుబావులు,వర్షాధారం ఆధారంగా పంటలు పండిస్తారు. భూగర్భజలాలు పెంపొందించేందుకు నీటి కుంటలు ఎంతో ఉపయోగపడుతాయి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా నిల్వ ఉంటుంది. భారీ వర్షాలకు భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన మట్టి గుంతల్లోకి చేరుతుంది. ఈ మట్టి ఎరువులా ఉపయోగపడుతుంది. నీటి కుంటలతో వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు పండించొచ్చు.
రైతులు పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని ఈజీఎస్ సిబ్బంది పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. కొంతమందికి దీనిపై పూర్తి అవగాహన లేక ముందుకు రావడం లేదు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో మొత్తం 393 మంజూరు కాగా 241 పూర్తయ్యాయి. 152 పూర్తి కావాల్సి ఉంది. గ్రామాల్లో వందశాతం నిర్మించుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పైసా ఖర్చులేకుండా ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో నీటి కుంటల నిర్మాణానికి పైసా ఖర్చు ఉండదు. వర్షపు నీటిని పొలంలో ఎక్కడ నిల్వ చేసుకోవాలో గుర్తించాలి. ఉపాధి సిబ్బంది ఇచ్చే కొలతల ప్రకారం నీటి కుంటను ఉపాధి కూలీలే నిర్మిస్తారు. 6 చదరపు మీటర్లు, 4 మీటర్ల పొడవు, 2 లేదా 3 మీటర్ల లోతు వరకు నీటికుంటలను నిర్మి ంచుకోవచ్చు..
వ్యవసాయ పొలాల వద్ద (పాంపాండ్స్) ఏర్పాటు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పాంపాండ్ ఏర్పాటు చేస్తే భూమి పోతుందని రైతులు ముందుకు రావడం లేదు. పాంపాండ్స్ ద్వారా లాభాలను వివరించి వందశాతం నిర్మించుకునేలా చూస్తాం.
-నితిన్, ఏపీవో, గాదిగూడ