ఎదులాపురం, ఏప్రిల్ 23 : రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో శనివారం ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల అంగన్వాడీలు, ఆశ కార్యర్తలు, ఏఎన్ఎంలు, సర్పంచులు, గ్రామస్థాయి అధికారులకు పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, సర్పంచ్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఆరోగ్య పోషకాహార దినోత్సవం నిర్వహించాలన్నారు.
ఎత్తు, బరువు లోపంతో ఉన్న పిల్లలను, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలను గుర్తించి ప్రత్యేక చికిత్స, పౌష్టికాహారం అందించాలని సూచించా రు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బాలామృ తం అందించాలన్నారు. 12 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలకు ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూ చించారు. అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడారు. అనంతరం జిల్లాలో రక్తహీనతను సమూలంగా నియంత్రించేందుకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా, డీఆర్డీవో కిషన్, జిల్లా అనిమియా నియంత్రణ అధికారి పవన్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్రాజు, సఖి కేంద్రం నిర్వాహకురాలు పవర్ యశోద, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.