సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 16: మానవ హక్కులను ఉల్లంఘిం చ వద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య సూచించారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళీకేరి అధ్యక్షతన సీసీసీ సింగరేణి అతిథి గృహంలో మానవ హక్కుల పరిరక్షణపై అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. అధికారులు మానవ హక్కులపై తప్పని సరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మానవ హక్కులను ఉల్లంఘించరాదని సూచించారు. కరోనా సమయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజల రక్షణ కోసం అధికారులు కష్టపడి పనిచేశారని అభినందించారు.
మా నవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. వితంతు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ అందుతుందో.. లేదో తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుతున్న వైద్యం, విద్యార్థులకు అందుతున్న విద్య, తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారుల పనితీరును అభినందించారు. నిబంధనల ప్రకారం అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ భారతీ హోళీకేరి అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీసీపీ అఖిల్‌మహాజన్, జిల్లా ఫారెస్ట్ అధికారి శివాని డోంగ్రె, జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 16: మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులకు మెరుగైన చికిత్సతో పాటు సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం డయాలసిస్, ప్రసూతి, పిల్లలు, ఐసీయూతో పాటు పలు వార్డుల్లో కలియతిరిగారు. రోగులతో మాట్లాడి దవాఖాలోనిసౌకర్యాలు, అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ భారతీ హోళీకేరి ఆధ్వర్యంలో రివ్యూ కమిటీ మంచిర్యాల జిల్లా కు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మంచిర్యాల దవాఖానలో అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. శానిటైజేషన్‌పై అభినందించారు. అనంతరం దవాఖానలో అందుతున్న సేవలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ జీసీ సుబ్బారాయుడు, సూపరింటెండెంట్ నూతన అరవింద్‌ను అభినందించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దావుద్ సులేమాన్, ఆర్డీవో వేణు, జిల్లా దవాఖాన అన్ని విభాగాల వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.