నెత్తిన రుమాలు.. నుదుట నామాలు.. మెడలో పూసలు.. నడుముకు పంచె.. చేతిలో డోలు.. కాళ్లకు గజ్జెలతో లయబద్ధంగా అడుగులో అడుగు వేస్తూ వినసొంపుగా వాయించే వారు ఒగ్గుడోలు కళాకారులు.. దశాబ్దాలుగా సంస్కృతీ సంప్రదాయా లను కాపాడుతూ కళకు జీవం పోస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన కళ నేటితరం యువకులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వేడుకలు, పార్టీ కార్యక్రమాలు, శుభకార్యాల్లో వీరి ప్రదర్శనలు, విన్యాసాలు ప్రత్యేకార్షణగా నిలుస్తున్నాయి. డీజేలు వచ్చిన తర్వాత కొంత ఆదరణ తగ్గినా.. తెలంగాణ సర్కారు కళను కాపాడేందుకు తర్ఫీదు ఇప్పిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని శిర్షా గ్రామంలో 32 మంది కళాకారులు ఉన్నారు. వీరిపై ప్రత్యేక కథనం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్తంపేట పంచాయతీ పరిధిలోని శిర్షా గ్రామంలో ఒగ్గుడోలు, బీరన్న కళాకారులు 32 మంది ఉన్నారు. వంశపారంపర్యంగా కళలను ప్రదర్శిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, ట్యాంక్‌బండ్‌పై.. రాష్ట్ర అవరతణ అనంతరం కూడా హైదరాబాద్ స్టెప్ కార్యాలయం, ఆదిలాబాద్, కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల వంటి పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. సంస్కృతిని కాపాడేలా ప్రదర్శనలు ఇచ్చినందుకు ప్రముఖులతో ప్రశంసాప్రతాలు కూడా అందుకున్నారు. రాష్ట్ర అవరతణ వేడుకల్లో ప్రతిభను కనబర్చినందుకు అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్ చేతుల మీదుగా గుర్తింపు పత్రాలతోపాటు సన్మానం పొందారు. ఇప్పటికీ కూడా వేడుకలు, పార్టీ కార్యక్రమాలు, శుభకార్యాల్లో వీరు ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఒగ్గుడోలు కళాకారులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు డోలు వాయించే వారు, మరొ కరు కథలు చెప్పేవారు. కళాకారులు కళను ప్రదర్శిస్తూ పురాణ కథలు చెబుతారు. వీరు చెప్పే కథల్లో ప్రధానంగా బీరన్న పెద్దపండుగ 30 మంది కళాకారులు 16 రోజులు, మల్ల న్న పట్నాలు ఐదుగురు కళాకారులు ఐదు రోజులు, ఎల్లమ్మ పట్నాలు ఐదుగురు నాలు గు రోజులు, పోచమ్మ కథ, పార్వతీ కల్యాణం, పెద్దిరాజు పెద్దమ్మ, గిరిజావతి, గొల్లరా జులు, ఐదు మల్లెపూల కథ, మహందాత ఇలా అన్ని రకాల దేవతల కథలు చెబుతా రు. ఇందులో ఒగ్గుడోలు కళాకారులు శిక్షణ పొంది ప్రదర్శిస్తుంటే కథలు మాత్రం వంశీయుల ద్వారా వంశపారంపర్యంగా చెబుతారు. ఇలా కళను కాపాడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నా బృందంతో కలిసి హైదరాబాద్‌లో ఒగ్గుడోలు కళా ప్రదర్శనలు ఇచ్చా. తెలంగాణకు ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా అవతరణ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చా. ఉమ్మడి జిల్లాలో, ప్రత్యేక జిల్లాలు ఏర్పడిన తరు వాత కూడా మా విన్యాసాలు కొనసాగి స్తున్నాం. మేము నేర్చుకున్న ప్రదర్శ నను పది మందికి తెలిసేలా చేయడంలో చాలా ఆనందంగా ఉంది. ఒగ్గుడోలు కళా ప్రదర్శనలు చేసినందుకు ప్రభుత్వ ప్రశంసాపత్రాలు అందుకున్న. చాలా ఆనందంగా ఉంది.
– పోలె శ్రీశైలం, ఒగ్గుడోలు, బీరన్న కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒగ్గుడోలు కళ కీలక పాత్ర కలిగి ఉంది. తెలంగాణ ప్రజల కళలో ఒగ్గుడోలు కళ అనేది ప్రధానమైనది. అన్ని కళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే ఒగ్గుడోలు కళకు కూడా గుర్తింపు ఇవ్వాలి.
– అడె కొమురయ్య, బీరన్న కథల కళాకారుడు, డోర్‌పెల్లి.
ఒగ్గుడోలు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. నేను డిగ్రీ వరకు చదివి మా తాతల కాలం నుంచి వస్తున్న ఈ కళను నేర్చుకుని ప్రదర్శిస్తున్నా. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒగ్గుడోలు కళకు ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు గుర్తింపు లభించింది. అదేవిధంగా ఒగ్గుడోలు కళాకారులకు ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియచేసే విధంగా మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పల్లెల్లో చైతన్యం వచ్చే కార్యక్రమాలు, పరిశుభ్రత, హరితహారం, ఆడపిల్ల చదువు ఇలా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రదర్శనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం మమ్మలను ఆదుకుంటుందని కొండంత ఆశతో ఉన్నాం.
– పోలె బీర్కుమార్, ఒగ్గుడోలు కళాకారుడు, శిర్షా.
మేము ఇప్పటివరకు వందలాది ప్రదర్శనలు ఇచ్చాం. బీరన్న కథలు పూర్తి చేయాలంటే 16 రోజులు పడుతుంది. ఇలా పెద్ద కథల నుంచి ఒక రోజులో పూర్తి అయ్యే కథలు కూడా చెబుతాం. ఒకప్పుడు ఈ కథలకు మంచి ఆదరణ ఉండేది. రానురాను ఆదరణ లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వంలో మా కళలకు ప్రత్యేక గుర్తింపు వస్తదని ఆశిస్తున్నాం.
– ఆడె సాయిలు, బీరన్న కళాకారుడు, డోర్పల్లి.
నేను 38 ఏండ్లుగా ఒగ్గుడోలు కథలు చెబుతున్న. దాదాపు 25 నుంచి 30 రకాల కథలు చెబుతా. అందులో ఒకరోజులో పూర్తయ్యేవి, 15 రోజుల వరకు చెప్పేవి ఇలా అన్ని రకాల కథలు ఉంటాయి. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఆచరిస్తున్నం. నా తరువాత నా పిల్లలు కూడా ఆచారాన్ని కొనసాగిస్తారు. మా వంశపారంపర్యంగా ఈ కథలను నేర్చుకుని చెబుతున్నం. మా పెద్దలకు, మాకు చదువు లేదు. కానీ.. కథలో మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా చెబుతాం. మా తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి చేస్తాం.
– కందూరి పోశయ్య, పెద్ద మనిషి.
ఒగ్గుడోలు కళలపైనే జీవిస్తున్నం. ఈ కథలు, కళలతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఇలాంటి కథలు, కళలు ప్రదర్శిస్తే కొద్దోగొప్పో డబ్బులు వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఆదరణ తగ్గింది. దీంతో చూసే వాళ్లు కూడా లేకుండా పోయారు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. పంటల సమయంలో కథలు చెప్పడానికి పోతే పంటలన్నీ పాడవుతున్నాయి. అట్లని మాకున్న కళను వదులేకపోతున్నాం.
– పెద్దపోలే రాజులు, ఒగ్గు కథల కళాకారుడు, శిర్షా.
గతంలో ఏ వేడుక, కార్యక్రమం జరిగినా ఒగ్గుడోలు కళాకారుల సందడి ఉండేది. నేడు పట్ట ణం, పల్లెలు తేడా లేకుండా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో డీజే సౌండ్స్‌తో కళకు కొంత ఆదరణ తగ్గింది. ఈ క్రమంలో ఈ కళారూపాన్ని పరిరక్షించి జీవం పోయాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. కరీంనగర్ జిల్లాలో బీటెక్‌తోపాటు డిగ్రీ, ఇంటర్, ఉన్నత చదువులు చదివిన వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 11 మంది యువకులు వెళ్లి శిక్షణ పొందారు. ఇందులో కట్బీట్, ఓంకారం, సర్పదెబ్బ, అడుగులు, దరువులు, సూది మానుగుండు, శివముద్ర, కృష్ణా, నరసింహ, విష్ణు, హన్మాన్, కొమురెళ్లి మల్లన్న అవతారాలు, సింగిల్ కమాన్, సిర్ర దొమ్మరి గంట, శవాసనం, వజ్రాసనం తదితర విన్యాసాల్లో శిక్షణ తీసుకొని ప్రశంసాప్రతాలు కూడా అందుకున్నారు.