దిలావర్పూర్, మే 14 : చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టు నుంచి కోనేరు వరకూ ప్రతీది చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నది. కోరమీసాలతో, నిప్పులు కురిపించే కళ్లతో నరమృగ శరీరంతో స్తంభంలోంచి ఉద్భవిస్తాడు నరసింహస్వామి. ఇక్కడి ఆలయం వద్ద కోనేరులోని నీరు రుతువులు మారినట్లు ఆరు రంగులుగా మారుతుందని, ఇందులో స్నానం చేస్తే చర్మరోగాలు రావని భక్తుల నమ్మకం.
13వ శతాబ్దంలో కాకతీయ రాజులు కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఆలయం వెనుకభాగంలో ఉన్న కొండమీద స్వామివారు సింహరూపంలో స్వయంభూగా వెలిశాడని చెబుతారు. దానికి నిదర్శనంగానే ఇప్పటికీ గర్భాలయంలో నరసింహస్వామిని దర్శించిన అనంతరం భక్తులు కొండమీదకు వెళ్లి పూజలు చేస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్ధశి రోజు నుంచి నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. పౌర్ణమి రోజున నృసింహుని కల్యాణం నిర్వహిస్తారు.
కాల్వ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15న ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజైన ఆదివారం ఉదయం అఖండ దీప స్థాపనం, నృసింహ జయంతి, సాయంత్రం స్వస్తిహవాచనం, కులదేవతా స్థాపనం, అంకురారోహణం, హవనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలుంటాయి. సోమవారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞం, ధ్వజారోహణం, బలిహరణం, గరుడ ముద్దల పంపిణీ, అనంతరం నృసింహుడి కల్యాణం ఉంటాయి. మంగళవారం సాముహిక కుంకుమార్చన, సాయంత్రం బలిహరణం, బుధవారం బేరీపూజ, హవనం, గురువారం పర్వాతారోహణం, నివేదన, సాయంత్రం దోపుకథ, శుక్రవారం శేషహోమం, పూర్ణాహుతి, హవనం, అవబృత స్నానం, నాగవెల్లి స్నానాలు, పుష్కరిణిలో చక్రతీర్థం, శనివారం తెల్లవారుజామున స్వామి వారికి నాగవెల్లి, భూతబలి ఉద్వాసన బలి, ఏకాంతోత్సవం, ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, మంగళవారం మారుపెళ్లి సేవలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు శ్రీమాన్ చక్రపాణి నరసింహమూర్తి, శ్రీమాన్ వాసుదేవాచార్యుల అధ్వర్యంలో కొనసాగుతాయి. కాగా.. ఆలయం వద్ద కాల్వ గ్రామ యువకులతో పాటు నిర్మల్ జిల్లాలోని నృసింహుని భక్తులు స్వామి వారి బ్రహ్మోత్సవ సమయంలో మాలధారణ చేస్తుంటారు. ఈ సమయంలో వీరందరు ఆలయం వద్దే ఉంటూ స్వామి వారి సేవలో పాల్గొంటారు. నిర్మల్ పట్టణానికి చెందిన నర్సయ్య 25 ఏండ్లుగా మాల వేసుకుంటూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
నరసింహస్వామి కల్యాణోత్సవం రోజు ఆలయం వద్ద శ్రీమాన్ చక్రపాణి నరసింహమూర్తి, శ్రీమాన్ వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో గరుడ ముద్దలు వేసే కార్యక్రమం ఉంటుంది. సంతానం లేని, కాని వారు ఆలయం వద్ద పండితులు వేసే గరుడ ముద్దల కార్యక్రమంలో పాల్గొని వీటిని స్వీకరించి తిన్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు, చరిత్ర చెబుతున్నది.
కాల్వ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. కల్యాణం రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకు అనుగుణంగా ఆలయం వద్ద బారికేడ్లు, పార్కింగ్ సౌకర్యం కల్పించాం. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం.
– చిన్నయ్య, ఆలయ చైర్మన్
నేను 25 ఏండ్లుగా నృసింహుడి మాలాధారణ చేస్తున్న. 11 రోజుల పాటు ఆలయం వద్దే ఉండి నృసింహుని సేవలో పాలు పంచుకుంటున్న. నాకు నృసింహుని కృపతో కోరిన కోర్కెలు తీరుతున్నాయి. నేను, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నాం.
– ఆదుముల్ల నర్సయ్య, నిర్మల్