బజార్హత్నూర్, మే 5 : సమస్త జీవరాశికి నీరే ప్రాణాధారం. అంతటి ప్రాధాన్యం ఉన్న నీటికి గడ్డుకాలం దాపురించింది. వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు రక్కసి కాటేసి భూగర్భ జలాలు అడుగంటి పోయే కాలం దూసుకు వస్తున్నది. తాగునీరు దొరికితే మహాభాగ్యం అనే రోజులు వచ్చేశాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుం ది. ఈ నీటి సమస్య ఎదురుకాకుండా ఉండాలం టే బొట్టుబొట్టునూ సంరక్షించక తప్పదు.
ప్రతి బొట్టును సంరక్షించి ఒడిసి పడితేనే భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవచ్చు. దీనికి పరిష్కారం ఇం కుడు గుంతల నిర్మాణం. నీటిని వృథా చేయకుం డా ఎక్కడికక్కడే ఇంకేలా చూస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనికి చేయాల్సిందల్లా ప్రతి ఇంటికో ఇంకుడు గుంత నిర్మాణానికి పూనుకోవడమే . రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుగాను మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సాహం లభిస్తుంది.
మనం రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించే క్రమంలో, వర్షం ద్వారా వృథాగా పోయే నీటిని, బోరుబావులు, కుళాయిల వద్ద వృథాగా పోయే నీటిని అరికట్టి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి. దీంతో నీరు అక్కడికక్కడే ఇంకిపోతుంది. ఇలా చేయడం ద్వారా పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ వల్ల ఏర్పడిన అపరిశుభ్రత కూడా కనిపించదు. దోమల వృద్ధికి ఆస్కారం ఉండదు. సమీపంలోని బోరుబావుల్లో నీటి శాతం పెరిగి భూగర్భజలాలు పెంపొందుతాయి.
ఇంకుడు గుంతలు నిర్మించుకునే వారికి ఉపాధిహామీ పథకం ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహకం అందిస్తున్నారు. సామాజిక బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణానికి రూ.12వేలు, వ్యక్తిగతంగా ఇంటి వద్ద నిర్మించుకునేవి అయితే రూ.4200 చెల్లిస్తారు. దీంతో ఇంకుడు గుంతల నిర్మాణానికి అయ్యే ఆర్థిక భారం కూడా తగ్గినట్లే.
మురుగు నీటిని నివారించి అపరిశుభ్రతను తొలగించి దోమలు వృద్ధి చెందకుండా ఉపయోగపడుతుంది. భూగర్భ జలశాతాన్ని పెంపొందించి బోరుబావుల్లో నీటిశాతాన్ని పెంపొందిస్తుంది.అంతేకాకుండా నీటి ఎద్దడి ముప్పును తొలగిస్తుంది.
వ్యక్తిగతంగా ఇంటి వద్దే నిర్మాణమైతే నాలుగు అడుగుల పొడవు, వెడల్పులతో ఆరు అడుగుల లోతుతో గుంత తీయాలి. గుంతలో 1.5 అడుగులో 60ఎంఎం కంకర, మరో 1.5 అడుగులో 40 ఎంఎం కంకర వేయాలి. మూడు అడుగుల సిమెంట్ గోలంపై రంధ్రాలు చేసి దించాలి. దానిచుట్టూ 60 ఎంఎం కంకర వేసి నింపాలి. వృథాగా పోయే నీటిని పైపు ద్వారా ఇంకుడు గుంతలోని సిమెంట్ గోలంలోకి వెళ్లేలా ఏర్పాటు చేసి మూత బిగించాలి. సామాజిక ప్రదేశాల్లో అయితే రెండు మీటర్ల పొడవు, వెడల్పు లోతులతో ఏర్పాటు చేసుకోవాలి.
ఇంకుడు గుంతల నిర్మాణంతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. భావితరాల వారికి నీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే వృథా నీటిని అరికట్టి, ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలంలో వంద శాతం ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టి వృథా నీటిని అరికడుతాం.
మహేందర్ రెడ్డి, ఎంపీడీవో