మే 4 : రాష్ర్టాన్ని పచ్చదనానికి నిలయంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. హరితహరంలో భాగంగా రోడ్ల వెంట, పొలాల గట్లపై, కార్యాలయాల ఆవరణల్లో, పాఠశాలల్లో, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేలా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పల్లె, బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా నాటేందుకు వీలుగా మొక్కలను పెంచేందుకు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో నర్సరీలను నెలకొల్పింది.
అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో అటవీ జాతులు, పండ్లు, కలప, ఆయుర్వేద రకాల మొక్కల పెంపకం చేపట్టారు. వేసవి నేపథ్యంలో వీటి సంరక్షణకు చర్యలు చేపట్టడం గమనార్హం. ఎండ తీవ్రత నుంచి మొక్కలకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే తుంపర విధానంలో మొక్కలపై నీటి జల్లులు పడేలా చర్యలు తీసుకున్నారు.
నర్సరీలలో కూలీలను నియమించి మొక్కలను సంరక్షిస్తున్నారు. నిత్యం రెండు వేళల్లో నీటి తడులు అందజేస్తున్నారు. ఎండిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి పెంచుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. తెగుళ్లు రాకుండా ఒక వేళ ఆశించగానే నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి వర్షాకాలంలో నాటేందుకు వీలుగా వాటిని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఇచ్చోడ రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు నర్సరీలు, ప్రైవేట్ ఆధ్వర్యంలో రెండు నర్సరీలు ఉన్నాయి. ఇచ్చోడ, దంపూర్, కోకస్మన్నూర్, పిప్పిరి గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయగా ఇందులో 6 లక్షల 60వేల మొక్కల పెంపకం చేపట్టారు. వీటిలో ముఖ్యమైన ఆయుర్వేద రకాలు, సహాజసిద్ధంగా పెరిగితే వాతావరణ మార్పులను తట్టుకుంటాయి.
అదే కవర్లలో పెంచితే సంరక్షణకు పలు చర్యలు తీసుకోవాల్సిందే. ఎండ తీవ్రత నుంచి జాగ్రత్తగా రక్షించాలి. అటవీశాఖ కేంద్ర నర్సరీల్లో ఆశ్వగంధ, నీలవేప, కలబంద, తిప్పతీగ, కృష్ణతులసీ, నిమ్మగడ్డి, ఇతరత్రా వాటిని పెంచుతున్నారు. ఆయా వాటిని చలువ పందిరి వేసి రక్షణ చేపట్టారు.
అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ మొక్కలను పరిశీలిస్తున్నాం. ఇళ్లలో పెంచేందుకు అనుగుణమైనవి సైతం పెంచుతున్నాం. సూచనలు సలహాలు ఇస్తున్నాం.
-బర్నోబా, ఇచ్చోడ ఎఫ్డీవో