దశాబ్దాలుగా అణగారిన సమాజంలో వెలుగు పూలు పూస్తున్నాయి. దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చారిత్రక దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రూ.36.10 కోట్లతో 361 యూనిట్లు పంపిణీ చేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న వారు.. నేడు యజమానులుగా మారారు. ప్రజాప్రతినిధులు వాహనాలు అందించగా.. లబ్ధిదారులు సంబురపడి పోయారు. కూలీనాలి చేసుకుని బతికే తమ బతుకులను తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకడమేకాదు నిండునూరేళ్లు చల్లంగ ఉండాలని దళితలోకం దీవిస్తున్నది. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో చూపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి, విప్, ఎమ్మెల్యేలు కొనియాడారు.
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఎదులాపురం/నిర్మల్ అర్బన్/భైంసా/ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 14
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం దళితబంధు పథకం యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. రూ.36.10 కోట్లతో 361 మందికి ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కార్లు, గూడ్స్ వెహికిల్స్, జేసీబీలు లబ్ధిదారులకు అందజేశారు. ఆదిలాబాద్‌లో రూ.7.30 కోట్లతో 73 మందికి, నిర్మల్‌లో 20.40 కోట్లతో 204 మందికి, మంచిర్యాలలో 7.40 కోట్లతో 74 మందికి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో రూ.1 కోటితో 10 మంది లబ్ధిదారులకు వాహనాలు అందించారు. కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4 లక్షలు జమ చేయగా.. మిగతావి రూ.6 లక్షలు త్వరలో జమ చేయనున్నారు. ఆయా చోట్ల మంత్రి, విప్, ఎమ్మెల్యేలు వాహనాలు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తా. నాకు ట్రాక్టర్ మంజూరైంది. నేను డిగ్రీ వరకు చదువుకున్న. వ్యాపారం చేయాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామనుకున్న. ఆ సమయంలో మా ఊరు దళితబంధు కింద మొదటి విడుతగా ఎంపికైంది. నా కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– మహేశ్, లబ్ధిదారుడు, మాంజ్రి
నాకు డెయిరీ ఫాం మంజూరైంది. నేను ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటా. పాల వ్యాపారంలో కొంత అనుభవం ఉంది. అం దుకే డెయిరీ ఫాం తీసుకు న్నా. బోరు మోటారు తో పాటు షెడ్డు నిర్మాణం, 8 బర్రెలను ఒక యూనిట్‌గా అందజేస్తున్నారు. ఈ పథకంలో చాలా సౌలత్లు ఉన్నాయి. దళితుల కోసం ఇంత మం చి పథకం ఇచ్చిన సీఎం కేసీఆర్ సారు మేలు మరువలేం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం దళితబంధు పథకం యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. రూ.36.10 కోట్లతో 361 మందికి ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కార్లు, గూడ్స్ వెహికిల్స్, జేసీబీలు లబ్ధిదారులకు అందజేశారు. ఆదిలాబాద్‌లో రూ.7.30 కోట్లతో 73 మందికి, నిర్మల్‌లో 20.40 కోట్లతో 204 మందికి, మంచిర్యాలలో 7.40 కోట్లతో 74 మందికి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో రూ.1 కోటితో 10 మంది లబ్ధిదారులకు వాహనాలు అందించారు. కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4 లక్షలు జమ చేయగా.. మిగతావి రూ.6 లక్షలు త్వరలో జమ చేయనున్నారు. ఆయా చోట్ల మంత్రి, విప్, ఎమ్మెల్యేలు వాహనాలు పంపిణీ చేశారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 14 : దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో దళితజాతి ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబందు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతుబందు తరహాలో ప్రతి దళిత కుటుంబానికి మేలు చేసేలా దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నిర్మల్ నియోజికవర్గంలోని దళిత కుటుంబాలకు దశలవారీగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో 1,500 మందికి దళితబంధు రానుందని వివరించారు.
నిర్మల్ నియోజికవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున మొత్తం 100 మందికి రూ.10 కోట్లతో వాహనాలు పంపిణీ చేశారు. ఇందులో 52 మంది లబ్ధిదారులు వాహనాలు ఎంపిక చేసుకున్నారు. వారికి 22 ట్రాక్టర్లు, 10 ఫోర్ వీల్లర్ వెహికిల్స్, నాలుగు గూడ్స్ వెహికిల్స్, 12 కార్లు, ఒకటి హార్వెస్టర్, మూడు జేసీబీలను మంత్రి అందజేశారు. ఇతర యూనిట్ల లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.4 లక్షలు ఇది వరకే జమకాగా.. రెండు రోజుల్లో మిగతా రూ.6 లక్షలు జమకానున్నాయని తెలిపారు. యూనిట్లు పొందిన వారందరూ కష్టపడి ప్రభుత్వం అందించిన యూనిట్లతో రెట్టింపు ఆదాయం సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్మద, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ మహిపాల్, ఆర్డీ రమేశ్, అడెల్లి ఆలయ చైర్మన్ చందు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 14 : దళితుల పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం ద్వారా అమలైన వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
వాహనాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోని ఉన్నత స్థాయికి ఎదగలని సూచించారు. మొదటి విడుత ముగిశాక రెండో విడుతలో నియోజకవర్గానికి 1500 మంది దళితులకు లబ్ధి చేకూరనుందన్నారు. లబ్ధిదారులకు వసతులు ఏర్పాటు చేయని పీడీ విజయలక్ష్మిపై అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఎంపీపీ అబ్దుల్ మోయిద్, వైస్ చైర్మన్ వాల్సింగ్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఏఈవో మనోహర్, ఎంపీడీవోలు వనజ, క్రాంతి, సీఐ అజయ్‌బాబు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
దళితుల దరిద్రం పొగొట్టేందుకు దళితబంధు పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. దశాబ్దాలుగా పాలించిన పాలకులు మమ్మల్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సార్ మా బాధలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నాడు. నాకు దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షల కారు ఇచ్చారు. మా కుటుంబానికి శాశ్వత ఉపాధి లభించింది. ఇలాంటి పథకాలు అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– పల్లెర్ల గంగవ్వ, లబ్ధిదారు, తర్లపాడు
దళితబంధు పథకంతో మా జీవితాలు మారనున్నాయి. ఎన్నో ఏండ్ల కల సాకారమైంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి మా మండలం దస్తురాబాద్ 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణికులను చేరవేయడానికి రూ.10 లక్షలతో ప్యాసింజర్ వాహనం తీసుకున్నా. మా కుటుంబ పరిస్థితులు మెరుగు పడుతాయి. దళితులను ధనవంతులుగా చేయడానికి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నాం.
– మరెంపల్లి హేమ, లబ్ధిదారు, దేవునిగూడెం, దస్తురాబాద్ మండలం