
ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల భూగర్భ జలాలను పరిరక్షించుకోవడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వీలుంటుందని రాష్ట్ర సర్కారు సూచిస్తున్నది. ఏటా వరి వేయడం వల్ల నీటి వినియోగం పెరిగి.. అడుగంటి పోయే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నది. మరోవైపు భూములు సారవంతం కోల్పోయి రైతులు నష్టపోయే ముప్పున్నదని, పంట మార్పిడితోనే మంచి దిగుబడులు సాధించవచ్చని ప్రోత్సహిస్తున్నది. ఎకరా వరికి 50 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుండగా, ఇదే నీటితో 8 ఎకరాల్లో వివిధ రకాల పప్పు దినుసులు సాగు చేసుకోవచ్చని భూగర్భ జలశాఖ చెబుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో సాధారణ వర్షపాతంకంటే 20 శాతం అధిక వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు ఎన్నడూలేని రీతిలో గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలాల సంరక్షణకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ యాసంగి సీజన్లో వరి సాగు పెంచడం వల్ల భూగర్భ జలాల్లో క్షీణత ఏర్పడుతోందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎకరం వరి సాగుకు జిల్లాలో 1.2 క్యూబిక్ మీటర్ల నీరు (50 లక్షల లీటర్లు) అవసరముంటుంది. అదే ఆరుతడి పంటలు వేస్తే 0.60 క్యూబిక్ మీటర్ల నీరే సరిపోతుంది. అంటే 50 శాతం నీరు ఆదా అవుతుంది. సర్కారు చెప్పిన ప్రకారం ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల భూగర్భ జలాలను పరిరక్షించుకోవడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా భూగర్భ జలశాఖ ప్రతినెలాఖరులో భూగర్భ జలాలను లెక్కిస్తుండగా, ఉమ్మడి జిల్లాలో సగటున 5.5 మీటర్ల నీటి లభ్యత ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే భూగర్భ జలాలు నమోదయ్యాయి. నిర్మల్‌లో 42, ఆదిలాబాద్‌లో 15, ఆసిఫాబాద్‌లో 20, మంచిర్యాలలో 18 డిజిటల్ వాటర్ మిషన్ ఫిజియో మీటర్ల ద్వారా ప్రతినెలా భూగర్భ జలాలను లెక్కిస్తున్నారు. ఈ ఏడాది మే నెలతో పోల్చితే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. మే నెలలో నిర్మల్‌లో 10.38 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 3.38 మీటర్లు పైకి నీరు వచ్చింది. ఆదిలాబాద్‌లో 10.80 మీటర్ల నుంచి 3.14కు, మంచిర్యాలలో 7.35 మీటర్ల నుంచి 4.14కు, ఆసిఫాబాద్‌లో 8.71 మీటర్ల నుంచి 4.51 మీటర్ల పైకి నీరు వచ్చింది. జూన్ నుంచి అక్టోబర్ మాసం వరకు వర్షాలు కురవడం, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలు నిండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నికర భూగర్భజలాలు 2,02,146 హెక్టా మీటర్లు ఉండగా, ఇందులో 83,632 హెక్టా మీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. 1,18,512 హెక్టా మీటర్ల మిగులు జలాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వరి సాగుతో భూగర్భ జలాల క్షీణత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలు, మంచిర్యాలలో లక్షా 80 వేలు, ఆదిలాబాద్‌లో 5 వేలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎకరం వరి సాగు చేయాలంటే పంట వేసినప్పటి నుంచి కోతకోసే వరకూ 1.2 క్యూబిక్ మీటర్ల నీరు (50 లక్షల లీటర్లు) వినియోగించాల్సి ఉంటుంది. అదే పప్పు దినుసులు, ఆముదం, బొబ్బెర్లు, పెసర్లు, మినుములు, జొన్నలు, మక్కజొన్న, కూరగాయలు, పసుపు, సజ్జలు, తదితర పంటలు వేస్తే నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 50 లక్షల లీటర్లతో 8 ఎకరాల్లో వివిధ రకాల పప్పు దినుసులు సాగు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఆరుతడి పంటలతోనే అనేక ప్రయోజనాలు
సాగునీటి బోర్ల కింద రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన ఆరుతడి పంటలు వేసుకుంటేనే అనేక ప్రయోజనాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్, మంచిర్యాల, ఖానాపూర్, లక్షెట్టిపేట్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా నీటి వనరులు ఉండడంతో రైతులు యేటా వరిని సాగు చేసుకుంటున్నారు. వరి పంట కాలం 130 నుంచి 150 రోజులు పండుతోంది. అదే ఆరుతడి పంటలైన మక్క, సజ్జ, ఆముదం, పప్పు దినుసు పంటలు, నువ్వులు, కూరగాయలు 90 నుంచి 110 రోజుల్లో కోతకు వస్తాయి. ఆకుకూరలైతే 45 నుంచి 60 రోజులు, కూరగాయలు 80 నుంచి 90 రోజుల్లోనే చేతికొస్తాయి. వరి పంటతో పోల్చితే దాదాపు 50 రోజులు ముందుగానే పంట చేతికొస్తుంది. ఆరుతడి పంటలు వేయడం వల్ల భవిష్యత్ తరాలకు భూగర్భ జలాల కొరత ఉండే అవకాశముండదని అధికారులు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కూడా పొందవచ్చు.
వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు చేయడం వల్ల భూగర్భ జలాల క్షీణత తీవ్రంగా ఉంటుంది. ఐదేళ్లుగా భూగర్భ జలశాఖ అధికారుల లెక్కల్లో ఈ విషయం తేటతెల్లమైంది. మే నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నికరంగా భూగర్భ జలాలు 10.80 మీటర్ల లోతులో ఉండగా, అక్టోబర్ మాసానికి వర్షాల కారణంగా సగటున 4.40 మీటర్ల పైకి నీరు వచ్చింది. ఆరు నెలల్లోనే భూగర్భ జలాల వృద్ధి సుమారు ఆరు మీటర్లు పెరిగింది. అక్టోబర్ మాసం నుంచి రబీ సీజన్ ప్రారంభమై వరి సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతుంటాయి. అదే వరికి బదులు ప్రత్నామ్నా య పంటలు వేసుకుంటే.. నాలుగు రెట్లు అధి కంగా పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
ప్రత్యామ్నాయ పంటలతోనే మేలు
వనరుల్లో నీరు ప్రధానమైంది. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే మేలు జరుగుతుంది. వరి సాగు చేయడం వల్ల నీటి ఎద్దడి తలెత్తుతుంది. ఇప్పుడు వరిపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో రైతులు స్వచ్ఛందంగా ఆరుతడి పంటలు వేసుకుంటేనే మంచిది.
సార్లు చెప్పడంతో..
మా ఊరిలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా యాసంగిలో ఎకరంలో వరి సాగు చేస్తా. మిగతా నాలుగు ఎకరాల్లో మక్క వేస్త. అయితే ఈసారి వరి వేస్తే ఇబ్బందులు తప్పవని సార్లు ముందే చెప్పారు. దీంతో పొద్దుతిరుగుడు వేసిన. ఎకరం వరికి వాడుకునే నాటితో నాలుగెకరాల మక్కను సాగు చేస్తున్న.
మొత్తం మక్కే వేస్తున్న
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ మోటరు ఉంది. ఏటా యాసంగిలో సగం మక్క.. మరో సగం వరి వేసుకుంటా. ఎండాకాలంలో భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల అటు వరికి, ఇటు మక్కకు నీటి తడులు పెట్టేందుకు తిప్పలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం వరిని వద్దని చెప్పడంతో మొత్తం మక్కే వేస్తున్న. మక్కకు పెద్దగా నీరు అవసరముండదు.