అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని మొయిన్ చెరువు నుండి మల్లిఖార్జుననగర్, బాపూనగర్, పటేల్‌నగర్, ప్రేంనగర్ మీదుగా ఎస్టీపీ వాటర్‌వర్క్ గేట్ వరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బుధవారం పాదయాత్ర నిర్వహించారు.
ఇందులో భాగంగా మొయిన్ చెరువు నుండి వచ్చే వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా వరదనీరు సవ్యంగా వచ్చి ఎస్టీపీ గేటు వద్ద మూసీలో కలిసే విధంగా శాశ్వత పరిష్కారం చూపేందుకు అధ్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తగిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలన్నారు.
వీటితో పాటు పటేల్‌నగర్ నుండి ప్రేంనగర్ వరకు డ్రైనేజీ, డ్రెయిన్ వాటర్ కలిపి కాలువలో కలవడంతో తరచుగా ఓవర్‌ఫ్లో సమస్యలు వస్తున్నాయని, డ్రైనేజీ కోసం విడిగా మరో పైప్‌లైన్ నిర్మాణాన్ని అంచెలంచెలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. దీర్ఘకాలంగా వరదనీటి సమస్యతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
గతంలో ప్రజా ప్రతినిధులుగా పని చేసిన వారు ఈ సమస్యను విస్మరించారన్నారు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకొని వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని సంకల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, వాటర్‌వర్క్ డీఓపీ కృష్ణ, జీఎం సుబ్బరాయుడు, ఏఈలు కుశాల్, మాజీద్, వర్క్ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, లక్ష్మణ్, డీఈలు సుధాకర్, సువర్ణ, ఏఈలు శ్వేత, రవి, దుర్గా తదితరులు పాల్గొన్నారు.