యాదగిరిగుట్ట, తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ రీజినల్ రింగ్ రోడ్డు. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ వినిపిస్తున్నది. దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డు తొలిదశలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో సాకారమవుతున్నది. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలోని 33 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నారు. శాటిలైట్ సర్వే, హద్దు రాళ్లను పాతే పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సమీప ప్రాంతాల్లోని భూములను కొనుగోలు చేయడానికి రియల్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అధికారికంగా ప్రకటన లేకపోయినా యాదాద్రి ఆలయం రింగ్ రోడ్డుకు వెలుపల.. భువనగిరి పట్టణం లోపల ఉండేలా అలైన్మెంట్ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా రాణిస్తున్న జిల్లాకు ఆర్ఆర్ఆర్ మణిహారంగా మారనున్నది.
యాదాద్రి భువనగిరి, జనవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రాజధానిలో కిక్కిరిసిన వాహనాలతో ప్రయాణం నరకంగా మారుతున్నది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఇప్పటికే నగరానికి వెలుపల బాహ్య, అంతర్గత వలయాలను నిర్మించారు. తాజాగా.. మరో ప్రాంతీయ వలయ రహదారిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని రెండు భాగాల్లో నిర్మించనున్నారు. ఉత్తర భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తుప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, యాదాద్రి-భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల మీదుగా 158 కిలోమీటర్ల మేర తొలి దశలో నిర్మించనున్నది. దీనికి ఇప్పటికే ఎన్‌హెచ్-166ఏఏగా నామకరణం చేశారు. ఔటర్ రింగు రోడ్డుకు 40 కిలోమీటర్ల వెలుపల ట్రిపుల్ ఆర్ ఉండడం రియల్ రంగానికి బాగా కలిసి వచ్చే అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. వలయదారికి చెంతనే ఉన్న చిన్న చిన్న పట్టణాలు మరింతగా పురోగమించేందుకు ఈ నూతన ప్రాజెక్టు దోహదపడనుంది. దినదినాభివృద్ధి చెందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు ఈ ఆరు వరుసల రహదారి మరో మణిహారంగా నిలువనుంది.
భూసేకరణ కోసం కసరత్తు
ఉత్తరభాగంలో చేపట్టనున్న నిర్మాణానికి సంబంధించి భూముల గుర్తింపుపై కసరత్తు ముమ్మరంగా సాగుతున్నది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 20 మండలాల్లోని 111 గ్రామాల మీదుగా వెళ్లేలా తాజాగా మార్గాన్ని ఖరారు చేయగా.. ఇందుకు 4,620 ఎకరాలను సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,250 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,125 ఎకరాలు అవసరమని గుర్తించగా..సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎంతభూమి సేకరించాల్సి ఉంటుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణ కోసం జిల్లాకో బృందాన్ని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇది కొలిక్కివచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే శాటిలైట్ సర్వే జరుగుతుండగా..జిల్లాలో రీజినల్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో హద్దురాళ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే కాళేశ్వరం కాల్వ, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆయా భూముల్లోని సర్వే నంబర్లలో మార్కింగ్ చేసి నోటీసుల జారీతో సేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో యాభై శాతం భరించనున్నాయి.
పారిశ్రామిక ప్రగతికి ఊతం
హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారుల వెంట ఉన్న భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలు పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధ్దిని సాధిస్తున్నాయి. ఇప్పటికే దండు మల్కాపురం పారిశ్రామిక కారిడార్‌గా రూపుదిద్దుకుంటున్నది. హైదరాబాద్‌కు చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టూ వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మెరుగుపడ్డ రవాణా వ్యవస్థతో ఔత్సాహికులు సైతం ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకువస్తున్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యం మరింతగా పెరిగి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలిరానున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతోపాటు, వ్యవసాయేతర పరిశ్రమలు కూడా నెలకొల్పేందుకు మెండుగా అవకాశాలు కలగనున్నాయి. ఇదే క్రమంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఎన్నో రాష్ర్టాలకు కేంద్ర బిందువుగా మారుతున్న జిల్లాలో రవాణా సౌకర్యం సైతం అత్యంత సౌలభ్యం కానుంది. ఏది ఏమైనా.. హైదరాబాద్‌కు చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎన్నో ప్రాంతాల ప్రగతికి ప్రాంతీయ రహదారి దోహదం చేసే అవకాశం ఉంది.
మెరుగుపడనున్న రవాణా సౌలభ్యం
హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులను కలుపుతూ రీజినల్ రింగురోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారులతో రవాణా పరంగా చాలా వరకు ఇబ్బందులు తీరాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో జిల్లా శరవేగంగా అభివృద్ధ్ది చెందుతున్నది. జిల్లాలో ఉన్న జాతీయ రోడ్ల ఆలంబనగా పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రియల్ రంగం ఊపందుకోగా.. ఉపాధి అవకాశాలు సైతం పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డు సైతం దగ్గరలోనే ఉండడంతో జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాలకు రాకపోకలు సైతం సులభతరంగా మారాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య సైతం చాలావరకు తీరింది. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు వల్ల భవిష్యత్తులో జిల్లా రూపురేఖల్లో సమూలంగా మార్పులు రానున్నాయి.