అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి
మొక్కల గణన చేపడుతాం
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, ఆగస్టు 30 : 2019, 2020వ సంవత్సరాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లు, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మొక్కల గణనపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల శాతం సంరక్షణ గణనను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 2019, 2020 సంవత్సరాల్లో చేసిన హరితహారం ప్లాంటేషన్ ముల్యాంకనం సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సంబంధిత శాఖలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, అధికారులు హరితహారం మొక్కల గణనకు సంసిద్ధంగా ఉండాలన్నారు. మొక్కల గణనకు టీంలను ఏర్పాటు చేయాలని, మొక్కల గణనకు సంబంధించి వివరాలు ఏ రోజుకా రోజు ఎక్సల్ షీట్లో అప్లోడ్ చేయాలని, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ జిల్లాలో మొక్కల గణనకు టీంలను ఏర్పాటు చేసి మొక్కల గణన చేపడుతామని కలెక్టర్ తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో నర్సింహులు, డీఎఫ్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, జాన్కృపాకర్, రమేశ్ పాల్గొన్నారు.
15 రోజుల్లో పూర్తి చేయాలి
వనపర్తి, ఆగస్టు 30 : 2019, 2020 సంవత్సరాల్లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల గణనను 15 రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల గణనలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలన్నారు. ప్రతి మండలానికి ఒక ఏపీవోను నియమిస్తామని వీరి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు గణన కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.