అత్యధికంగా రాజపేటలో 15.7 సెంటీ మీటర్లు
చండూరులో 10.7, తిరుమలగిరిలో 7.6 సెంటీమీటర్లు
మునుగోడు మండలంలో 20 ఏండ్ల తర్వాత నిండిన చెరువులు
నల్లగొండ జిల్లాలో సాధారణం కంటే 47 శాతం అధిక వర్షపాతం
నల్లగొండ, ఆగస్టు 30 :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఐదు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో అత్యధికంగా 15.7 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా చండూరులో 10.7సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 7.6సెం.మీ వర్షం పడింది. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 370, సూర్యాపేటలో 350 చెరువులు నిండాయి. మునుగోడు మండలంలో కొన్ని చెరువులు 20 ఏండ్ల తర్వాత అలుగు పోస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 47.4 శాతం అదనపు వర్షపాతం నమోదవడం విశేషం.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో అధిక వర్షపాతమే నమోదైంది. వరుస వర్షాలతో చాలా గ్రామాల్లోని చెరువుల్లో జలకళ సంతరించుకుంది. దీంతో భూగర్భ జలాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నల్లగొండలో 370, సూర్యాపేటలో 350 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. ఇప్పటికే రెండు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండగా తాజా వర్షాలతో మరింతగా పెరిగే అవకాశం ఉంది.
47శాతం అదనపు వర్షపాతం
జూలైతో పాటు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది. నల్లగొండలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 47.4శాతం అదనంగా నమోదైంది. జూన్‌లో 85.2 మి.మీకు గాను 133.7, జూలైలో 145.2 మి.మీకుగాను 216.3, ఆగస్టులో 137.3 మి.మీకుగాను 177.9 మి.మీ పడింది. జిల్లాలోని 26 మండలాల్లో అదనపు వర్షపాతం నమోదు కాగా ఐదు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షం పడింది. అత్యధికంగా చండూర్లో 117.0 మి.మీ. కనగల్‌లో 115.2, చిట్యాలలో 104.3, నార్కట్‌పల్లిలో 103.2 మి.మీ వర్షం పడింది.
చండూర్, కనగల్‌లో 10 సెం.మీ
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చండూర్ మండలంలో 107.1 మి.మీ, కనగల్‌లో 98.6 మి.మీ, శాలిగౌరారంలో 80, త్రిపురారంలో 65.6, అడవిదేవుల పల్లి 63, నకిరేకల్‌లో 61.9, అనుములలో 55.4, మిర్యాలగూడలో 51.7, గుర్రంపోడులో 49.2, నిడమనూరులో 42.1, కేతేపల్లిలో 41.9, చింతపల్లిలో 41.8, కట్టంగూర్‌లో 41.7, నల్లగొండలో 36, గుండ్లపల్లిలో 35, దామరచర్లలో 34.1, నార్కట్‌పల్లిలో 32.6, నేరేడుగొమ్ములో 31.5, దేవరకొండలో 29.2, చిట్యాలలో 29.1, తిప్పర్తిలో 27.3, చందంపేటలో 26.9, మాడ్గులపల్లిలో 25, మునుగోడులో 24.8, మర్రిగూడలో 23, తిరుమలగిరి సాగర్‌లో 22.8, కొండమల్లేపల్లిలో 18.8, పెద్దవూరలో 18.4, నాంపల్లిలో 18, పీఏపల్లిలో 16.8 మి.మీ. వర్షం పడగా అత్యల్పంగా వేములపల్లిలో 10.3 మి.మీ కురిసింది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 1259.6 మి.మీ. వర్షం పడగా 40.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
భూగర్భ జలాలు పైపైకి
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా రెండు సీజన్లకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో ప్రతి సీజన్‌కూ చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. దీనికి తోడు మూడేండ్లుగా వర్షాలు సైతం అధికంగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు భారీగా పెరుగుతున్నాయి. నాలుగేండ్ల క్రితం 20మీటర్ల పైన ఉన్న భూగర్బ జలం గతేడాది ఏడు మీటర్ల వరకు వచ్చాయి. ఈ ఏడాది రెండు మీటర్లలోపే ఉండగా తాజాగా కురిసిన వర్షాలతో మరింత పైకి వచ్చే అవకాశం ఉంది. వరుస వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. చేలల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలని సూచిస్తున్నారు.