హుజూర్నగర్, ఆగస్టు 30 : నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసినట్లు సోషల్ మీడియాలో ఆయన అనుచరులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నాడని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సొంత నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకుడికి టీపీసీసీ పదవి కట్టబెట్టారని, రేవంత్‌రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో జనాలకు చెప్పలేకపోతున్నాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు తప్పక ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో 2వేల కోట్లతో ముక్త్యాల, జాన్‌పహాడ్ మేజర్లను అధునీకరించి ఎత్తిపోతల ద్వారా నీళ్లను మళ్లించనున్నట్లు తెలిపారు. రూ.27కోట్లతో నియోజకవర్గంలో 7 చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నామని, మరో 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేయించానని, కోటిన్నరతో హుజూర్‌నగర్‌లో బంజారాభవన్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న 12 పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలను కల్పించాలని పరిశ్రమల యజమానులతో మంత్రి కేటీఆర్ సమక్షంలో సమావేశం నిర్వహించినట్లు గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, డీసీసీబీ డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.