పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే కమిటీలో ప్రాధాన్యం
కేతేపల్లి, నకిరేకల్ మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల
సమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి
కట్టంగూర్(నకిరేకల్), ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని కేఆర్ఎల్ ఫంక్షన్ హాల్ జరిగిన కేతేపల్లి, నకిరేకల్ మండలాల టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి కమిటీల్లో తగిన ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కమిటీల్లో 51శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలను, 13 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, నాయకులు చిలువేరు ప్రభాకర్, మారం భిక్షంరెడ్డి, కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.