
రేపటి నుంచి విద్యాలయాల పునప్రారంభం
స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో శానిటేషన్ పూర్తి
నేడు హాస్టళ్లకు సన్నబియ్యం
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఏడాదిన్నరగా కరోనాతో మూతపడిన విద్యాసంస్థలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. అందుకోసం విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు హాస్టళ్ల నిర్వహణ, విద్యాసంస్థల వాహనాల సామర్థ్యం తదితర అంశాలపై దృష్టి పెట్టారు. వారం రోజులుగా వివిధ స్థాయిల్లో విద్యాసంస్థలను తనిఖీ చేస్తూ ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను తరలించే బస్సులపైనా ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఫిట్నెస్ ఉంటేనే బస్సులు నడపడానికి అనుమతి ఇవ్వనున్నారు. ఎంజీయూ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లల్లోనూ విద్యార్థుల రాకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా తగ్గినా ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకుండా సురక్షిత పద్ధతుల్లో చదువులు కొనసాగాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.
గత ఏడాది మార్చిలో మూతపడిన విద్యాసంస్థలు రేపటి నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లు ఆన్లైన్ క్లాసులతో కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఫోన్లతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇక ఆఫ్‌లైన్‌కు సిద్ధం అవుతున్నారు. బుధవారం నుంచి కేజీ టూ పీజీ వరకు అన్ని రకాల విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబంధిత అధికారులు అన్ని స్థాయిల్లోనూ రంగంలోకి దిగారు. విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గతంలో మాదిరిగానే పూర్తి స్థాయిలో తరగతుల నిర్వహణ చేయాల్సిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వరాదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ బోర్డు, యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతోనూ ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అన్ని రకాల విద్యాసంస్థలు ఇప్పటికే శానిటైజేషన్ చేపట్టాయి. తరగతి గదులు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని శుభ్రపరిచారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ హాస్టళ్లను కూడా పునఃప్రారంభానికి సిద్ధం చేశారు.
బస్సులను సిద్ధం చేశాకే అనుమతి..
విద్యార్థుల రవాణాలో కీలకమైన బస్సులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలకే పరిమితమైన స్కూల్ బస్సులను అన్ని రకాలుగా సిద్ధం చేశాకే అనుమతించేలా ఆర్టీఓ అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న బస్సులను గుర్తించి వాటి యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 849 వివిధ రకాల విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిన్నింటినీ రోడ్డెక్కించాలంటే ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. టైర్లు, సీట్లు, డోర్లు, ఫుట్‌బోర్డులు, కిటికీలకు అద్దాలు.. అన్నీ సరిగ్గా ఉంటేనే బస్సులను అనుమతించనున్నట్లు ఆర్టీఓ అధికారులు పేర్కొన్నారు. స్కూల్ బస్సులకు ఆరు త్రైమాసికాల ట్యాక్స్‌కు గాను రెండు త్రైమాసికాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నాలుగు త్రైమాసికాల ట్యాక్స్‌ను చెల్లించాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు. వాహన ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే.. బస్సులకు ఫిట్నెస్ చేయించాలన్న ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.
పకడ్బందీ చర్యలు : ఆర్టీఓ సురేశ్‌రెడ్డి, నల్లగొండ
విద్యాసంస్థల బస్సుల విషయంలో ఇప్పటికే యాజమాన్యాలతో చర్చించాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశిం చాం. ఐదేండ్ల అనుభవం కలిగిన, కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న డ్రైవర్లు ఉండాలి. అదేవిధంగా టైర్లు, ఇంజిన్ సామర్థ్ధ్యాన్ని పరీక్షించాకే బస్సులను నడుపాలి. విద్యార్థుల రక్షణ బాధ్యత పూర్తిగా యాజమాన్యాలదే. బస్సులతోపాటు ఆటోరిక్షాల్లో విద్యార్థులను తరలించే సమయంలోనూ శానిటేషన్‌తోపాటు భౌతికదూరం పాటించాలి.
సిద్ధంగా పాఠశాలలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలను సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే ఉపాధ్యాయులంతా రెగ్యులర్ విధుల్లో ఉన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల సహకారంతో అన్ని పాఠశాలలను శుభ్రం చేయడంతో పాటు తరగతి గదులను శానిటైజేషన్ చేశాం. మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలలకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు మాస్కులు ధరించి రావాలని, పాఠశాలలో భౌతిక దూరం పాటించాలని ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి మిగిలిన విద్యార్థులకు దూరంగా ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చాం. మధ్యాహ్న భోజనం వద్ద గుంపులు లేకుండా చూడాలి. సెప్టెంబర్ 1 నుంచి విధిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని, కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం. ఫీజుల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పాం.