మండల సమావేశంలో ఎంపీపీ శాంతాబాయి
అధికారుల తీరుపై వాకౌట్ చేసిన సర్పంచులు
అచ్చంపేట, ఆగస్టు 30: ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎంపీపీ శాంతాలోక్యనాయక్ అన్నారు. అచ్చంపేట మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఎజెండా ప్రకారం సమావేశం కొనసాగుతుండగా కొన్నిశాఖల అధికారులు హాజరుకాలేదు. ఆర్అండ్బీ, మత్స్యశాఖ, సోషల్వెల్ఫేర్, అటవీశాఖ, ఆర్టీసీ అధికారులు రాలేకపోతే సమావేశాలు ఎందుకని సర్పంచులు ప్రశ్నించారు. అధికారులు మండల సమావేశాలకు రాకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అధికారుల పనితీరుతో విసుగుచెంది మండల సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నట్లు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బొమ్మన్‌పల్లి సర్పంచ్ బోడ్కనాయక్ పేర్కొన్నారు. మండల సమావేశాలకు వస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వడంలేదని, ప్రజాప్రతినిధులంటే అధికారులకు గౌరవంలేదన్నారు. ఎంపీడీవో ఒత్తిడి ఎక్కువైందన్నారు. ఎంపీడీవో వైఖరి సరిగ్గాలేదని ఆరోపించారు.
అవార్డుల పంపిణీలో సర్పంచుల పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. చీటికిమాటికి సర్పంచులను సస్పెండ్ చేయడం సరైందికాదన్నారు. సమావేశాలకు రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీటీసీలతో సమావేశం కొనసాగించి సమస్యలపై ప్రస్తావించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని, సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని సూచించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిక పంపించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పే సమస్యలను అధికారులు నోట్ చేసుకోని పరిష్కారం చేసి వచ్చే మండల సమావేశాల్లో నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి, జెడ్పీటీసీ మంత్రియానాయక్, వైస్ ఎంపీపీ అమరావతి, డీఎల్పీవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.